|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 08:45 PM
తిరుపతి సమీపంలోని ఓ ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు లభ్యమవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ గృహ సముదాయంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా.. ముగ్గురిమృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు గుడియాత్తంకు చెందిన సత్యరాజ్ (30)కు అదే ప్రాంతానికి చెందిన పొన్నాగుట్టె నాయగి (30) అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో వీరిద్దరూ మూడు నెలల క్రితం దామినేడుకు వచ్చారు. ఇక్కడి ఇందిరమ్మ గృహ సముదాయంలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పొన్నగుట్టెకు ఇప్పటికే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా, వీరిద్దరూ స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈనెల 22వ తేదీ ఉదయం నుంచి సత్యరాజ్, పొన్నాగుట్టెతో పాటు ఆమె కూమారుడు కూడా బయట కనిపించలేదు. దాదాపు వారం రోజుల పాటు ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుంచి ఆ ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన వచ్చింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వచ్చి చూడగా, ఆ ఇంట్లో అనుమానాస్పదంగా కుళ్లిపోయిన స్థితిలో ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. సత్యరాజ్ మృతదేహం ఉరికి వేలాడుతూ ఉండగా.. పొన్నాగుట్టె, ఆమె కుమారుడు మృతదేహాలు గదిలోని బాత్‌రూమ్ వద్ద కింద పడి ఉన్నాయి. అయితే ఘటనా స్థలంలోనే విషం సీసా లభ్యం కావడంతో ఇది ఆత్మహత్యగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
అయినా వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా పొన్నాగుట్టె, ఆమె కుమారుడు విషం తాగి మరిణించినట్లు.. తర్వాత సత్యరాజ్ ఉరివేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, సత్యరాజ్ ముందుగా పొన్నాగుట్టె, ఆమె కుమారుడిని హత్యచేసి.. తర్వాత అతడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు
Latest News