|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 08:43 PM
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ జాతీయ పార్టీ చైర్‌పర్సన్ బేగం ఖలీదా జియా (80) ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఛాతీలో తీవ్ర ఇన్‌ఫెక్షన్ కారణంగా గుండె, ఊపిరితిత్తులపై ప్రభావం పడటంతో ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ పరిస్థితిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
విషమంగా మాజీ ప్రధాని ఆరోగ్యం..
బంగ్లాదేశ్‌కు తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన ఖలీదా జియా ఆ తర్వాత కూడా రెండుసార్లు ప్రధాని అయ్యారు. ఇలా మొత్తంగా ఆమె మూడుసార్లు బంగ్లాదేశ్‌కు ప్రధాన మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించారు. అయితే గత నెల నవంబర్ 23వ తేదీన ఖలీదా జియా అస్వస్థతకు గురయ్యారు. విషయం గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను.. ఢాకాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే చేరిన నాలుగు రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో కరోనరీ కేర్ యూనిట్‌కు తరలించారు.
ప్రస్తుతం ఆమెకు గుండె, ఊపిరితిత్తులకు సోకిన ఇన్‌ఫెక్షన్ కారణంగా పరిస్థితి విషమించడంతో సోమవారం వెంటిలేటర్‌పై ఉంచినట్లు బీఎన్‌పీ నేతలు తెలిపారు. ఖలీదా జియాకు స్థానిక వైద్యులతో పాటు అంతర్జాతీయ వైద్య నిపుణులు కూడా చికిత్స అందిస్తూ.. ఆమె ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఖలీదా జియా కొన్నేళ్లుగా కాలేయం, మూత్రపిండాల సమస్యలు, మధుమేహం, కీళ్లనొప్పులు, కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే అధునాతన చికిత్స కోసం నాలుగు నెలలు లండన్‌లో ఉండి.. మే 6వ తేదీనే ఆమె ఢాకాకు తిరిగి వచ్చారు.
బీఎన్‌పీ నేతలు మాట్లాడుతూ.. ఖలీదా జియా ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదని, చికిత్సలో వైద్యులు దాదాపు అన్ని అవకాశాలను వినియోగించుకున్నారని తెలిపారు. "ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇప్పుడు యావత్ దేశం ప్రార్థించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు" అని బీఎన్‌పీ వైస్-చైర్మన్ అహ్మద్ ఆజామ్ ఖాన్ పేర్కొన్నారు. ఆదివారం నాటికి కూడా ఆమె పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని సీనియర్ జాయింట్ సెక్రటరీ జనరల్ రుహుల్ కబీర్ రిజ్వి తెలిపారు.
ఖలీదా జియా అనారోగ్యంపై భారత ప్రధాని మోదీ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రజలకు విశేష సేవలు అందించిన ఆమె సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షించారు. ఖలీదా జియాకు అవసరమైన సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ ప్రకటించారు.
Latest News