|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 07:39 PM
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడి (26) పెళ్లి ఈ నెల 26న జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కోలాహలం మధ్య వివాహం వేడుక జరిగింది. ఊరేగింపుగా కొత్త దంపతులను వరుడి ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం రాత్రి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 12 గంటలకు బయటకు వెళ్లిన వరుడు.. మళ్లీ తిరిగి రాలేదు. దీంతో భయాందోళనకు గురైన ఆ యువకుడి కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికారు. అయినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. చివరికి 5 రోజుల తర్వాత అతడి ఆచూకీ లభించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజాఫర్‌నగర్‌లోని శారధన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఉంచాపుర్‌కు చెందిన మోను.. పెళ్లైన రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కరెంట్ బల్బు తీసుకొస్తాననే సాకుతో.. ఇంటి నుంచి బయటకు వెళ్లి వరుడు తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా.. రాత్రి గంగా నదీ ఒడ్డున తిరుగుతూ కనిపించడంతో మోను ఏ అఘాయిత్యం చేసుకున్నాడో అని.. అతడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఎంత వెతికినా అతడి జాడ కనిపించలేదు.
కాగా, డిసెంబర్ 1న వేరొకరి ఫోన్ నుంచి మోను తన తండ్రికి కాల్ చేసి.. తాను సురక్షితంగానే ఉన్నానని చెప్పాడు. ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో అతడి తండ్రి, బంధువులతో కలిసి మీరట్ పోలీసులు హరిద్వార్ వెళ్లి.. రైల్వే స్టేషన్ సమీపంలో మోనును గుర్తించారు. అనంతరం, ఎందుకు రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయావని పోలీసులు ప్రశ్నించగా.. పెళ్లి రోజు రాత్రి భయాందోళనకు గురైనట్లు చెప్పాడు. అనంతరం బస్సులో హరిద్వార్‌కు వెళ్లానని.. రైల్వే స్టేషన్ ప్రాంతంలో తిరుగుతూ 5 రోజులు గడిపినట్లు తెలిపాడు. మోను ఆచూకీ దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, పెళ్లైన రోజు మోనూకు అతడి ఫ్రెండ్స్ ఏదో తినిపించారని పోలీసులు చెబుతున్నారు. స్నేహితుల సలహాతో ఆరోజు ఒకరకమైన మెడిసిన్ తీసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. దాని ప్రభావం వల్లే మోను యాంగ్జైటీకి గురై ఉంటాడని అనుకుంటున్నారు. విచారణ అనంతరం మోనూను అతడి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించినట్లు పోలీసు అధికారి అశుతోశ్ తెలిపారు. అయితే మోను సహజంగానే భయస్థుడిలా ఉన్నాడని.. ఆరోజు నైట్ అతడు ఎందుకు అలా ప్రవర్తించాడో తమకు చెప్పలేదని పోలీసులు తెలిపారు.
Latest News