|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 07:39 PM
అమెరికాలో భారతీయ విద్యార్థుల పరిస్థితులు కఠినంగా మారినట్లే.. దాని పొరుగునే ఉన్న కెనడాలోనూ కూడా సీన్ మారుతోంది. గ్లోబల్ ఎడ్యుకేషన్ మ్యాప్‌లో అమెరికా తర్వాత మన విద్యార్థులు ఎక్కువగా చూసే సెకండ్ ఆప్షన్ కెనడానే. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి.... అక్కడ మనవాళ్ల సంఖ్య ఎక్కువ, వీసా రూల్స్ కాస్త ఈజీగా ఉండటం, హై క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంకా కెనడియన్ డాలర్ వాల్యూ కూడా హాట్‌గా ఉండటం. అయితే, గడిచిన కొంతకాలంగా కెనడాలో మన విద్యార్థుల వీసా దరఖాస్తులకు పెద్ద ఎత్తున రెడ్ సిగ్నల్ పడుతోంది.
లేటెస్ట్ డేటా ప్రకారం.. 2025 ఆగస్టులో ఇండియన్ స్టూడెంట్స్ స్టడీ వీసా అప్లికేషన్లలో ఏకంగా 74% తిరస్కరణకు గురయ్యాయి. 2024లో ఈ రిజక్షన్ రేట్ కేవలం 32% మాత్రమే ఉండటం గమనార్హం. 2023 ఆగస్టులో 20,900 మంది వీసాల కోసం దరఖాస్తు చేస్తే, 2025 ఆగస్టులో కేవలం 4,515 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని బట్టి డిమాండ్‌లో ఎంత పెద్ద డ్రాప్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వీసాల విషయంలో కెనడా ప్రభుత్వం తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు వల్లే ఈ పరిస్థితి వచ్చింది. దేశంలోకి పెద్ద సంఖ్యలో వస్తున్న వలసలను నియంత్రించడానికి, అలాగే నకిలీ అడ్మిషన్ల స్కామ్‌ను అరికట్టడానికి కెనడా సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. 2023లో కెనడా ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్ దాదాపు 1550 ఫేక్ లెటర్లను పట్టుకోగా, వాటిలో ఎక్కువ శాతం భారతదేశం నుంచే వచ్చినట్లు గుర్తించారు. దీనికి తోడు, మన విద్యార్థులు తమ ఫండింగ్ సోర్సెస్‌ను తప్పుగా చూపించడం లేదా అడ్మిషన్ డాక్యుమెంట్లలో తప్పులు ఉండటం కూడా ఈ రిజెక్షన్స్‌కు కారణాలని నిపుణులు చెబుతున్నారు.
గతంలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కారణంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న మాట నిజమే. అయితే, కెనడాలోని అనేక విద్యాసంస్థలకు మన భారతీయ విద్యార్థులే అతిపెద్ద ఆదాయ వనరని అక్కడి భారతీయ సంతతికి చెందినవారు చెబుతున్నారు.
విశ్వవిద్యాలయాల విషయానికి వస్తే, యూనివర్సిటీ ఆఫ్ వాటర్ లూలో భారతీయ విద్యార్థుల ప్రవేశాలు మూడింట రెండు వంతులు పడిపోయాయి. అలాగే యూనివర్సిటీ ఆఫ్ రిజైనా, సుస్కట్ సువాన్ వంటి టాప్ యూనివర్సిటీల్లో కూడా మన విద్యార్థుల చేరికల తాకిడి తగ్గింది. స్టడీ వీసా దరఖాస్తుల విషయంలో అధికారులు తీసుకుంటున్న కఠినమైన చర్యల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, ముఖ్యంగా విద్యార్థులు తమ ఫైనాన్షియల్ బ్యాకప్‌ను క్రిస్టల్ క్లియర్‌గా చూపించాలని స్పష్టం చేస్తున్నారు. ఇకముందు మన విద్యార్థులు కెనడాకు బదులుగా ఇతర దేశాలకు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందని విదేశాంగ నిపుణులు అంటున్నారు.
Latest News