|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 07:35 PM
నెల్లూరు లేడీ డాన్ అరవ కామాక్షి అలియాస్ కామాక్షమ్మ ఇంటిని స్థానికులు కూల్చివేశారు. హౌసింగ్ బోర్డు ఆర్డీటీ కాలనీలోని కామాక్షమ్మ ఇంటిని సోమవారం రాత్రి స్థానికులు కూల్చివేశారు. కామాక్షమ్మపై గంజాయి కేసుతో పాటుగా ఇతర నేరారోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె అరెస్ట్ అయిన తర్వాత స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది . దీంతో సోమవారం రాత్రి కామాక్షమ్మ ఇంటితో పాటుగా ఆమె అనుచరుల ఇళ్లను సామూహికంగా వెళ్లి ధ్వంసం చేశారు. మరోనైపు మంగళవారం ఉదయం పోలీసులు కామాక్షమ్మ ఇంటి వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి గోడల్లో దాచిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఇకపై కామాక్షమ్మను తమ ప్రాంతంలోకి రానివ్వమని స్థానికులు స్పష్టం చేశారు.
మరోవైపు సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో నెల్లూరు లేడీ డాన్‌గా పేరొందిన కామాక్షమ్మను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం పెంచలయ్యను గంజాయి బ్యాచ్ అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ కేసులో అరవ కామాక్షి కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉండే పెంచలయ్య.. ఎలక్ట్రిషియన్ పనులు చేస్తూ జీవించేవారు. అలాగే సీపీఎంలో నాయకుడిగానూ ఉన్నారు. ఇక ఆర్డీటీ కాలనీలోని ముత్యాలమ్మ గ్రామాభివృద్ది కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఆర్డీటీ కాలనీలో గంజాయి విక్రయాలు, వాడకం గమనించిన పెంచలయ్య వాటిని అడ్డుకున్నారు. అరవ కామాక్షి ఆధ్వర్యంలోనే గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పెంచలయ్య మీద కోపం పెంచుకున్న గంజాయి బ్యాచ్.. శుక్రవారం సాయంత్రం పిల్లలతో కలిసి స్కూటీపై ఇంటికి వెళ్తున్న పెంచలయ్యపై దాడి చేశారు. హౌసింగ్ బోర్డు ఆర్చి వద్ద తొమ్మిది మంది ఆగంతకులు పెంచలయ్యను దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కామాక్షితో పాటుగా.. ఇప్పటి వరకు పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. కామాక్షి ఇంట్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు పెంచలయ్య హత్యను నిరసిస్తూ నెల్లూరు బంద్ జరుగుతోంది. సీపీఎంతో పాటుగా దాని అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాలు ఈ బంద్‌కు మద్దతిచ్చాయి. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గంజాయి డ్రగ్స్, మహమ్మారి దిష్టిబొమ్మను సీపీఎం కార్యకర్తలు దహనం చేశారు. నెల్లూరులో పలు స్కూల్స్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి.
Latest News