|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 07:27 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలతో పాటుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అలాగే కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో పండిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామంటున్న ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ .. అవసరమైతే ధాన్యం కొనుగోలు ప్రక్రియను సంక్రాంతి వరకూ పొడిగిస్తామని ఇటీవల ప్రకటించారు . ఇక ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి 11,93,743 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటి దాకా రూ. 2,830 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు.
మరోవైపు రైతులు ధాన్యం విక్రయాల సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. విజయవాడ కానూరు పౌరసరఫరాల శాఖ భవనంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఏ సమస్య అయినా రైతులు వెంటనే తెలియజేయడానికి 1967 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ నంబర్ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని.. ధాన్యం అమ్మకాల సమయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ఈ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
ధాన్యం రిజిస్ట్రేషన్ సమస్యలు, టోకెన్ రావడంలో ఆలస్యం, ఆర్ఎస్కే/మిల్లులో తూకం సమస్యలు, ఎఫ్‌టిఒ పెండింగ్, రవాణా లేదా గోనె సంచుల కొరత,ధాన్యం కొనుగోలు ఆగిపోవడం వంటి సమస్యలపై రైతులు 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అయితే ఈ నంబర్‌కు ఫోన్ చేసేముందు రైతులు కొన్ని వివరాలను దగ్గరలో ఉంచుకోవాలని మంత్రి సూచించారు. రైతులు తమ ఆధార్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్,టోకెన్ నెంబర్, గ్రామం పేరు,ఆర్ఎస్కే వివరాలను దగ్గరలో ఉంచుకోవాలని సూచించారు.
రైతులు కంట్రోల్ రూమ్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత.. ఆ ఫిర్యాదును నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపిస్తామని.. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేవరకు అధికారులు ఫాలోఅప్ చేస్తారని నాదెండ్ల మనోహర్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ అధికారులు మండలాల వారీగా రైతులు, రైస్ మిల్లర్లు, ఆర్ఎస్కే నిర్వాహకులను ఫోన్ ద్వారా సంప్రదించి ధాన్యం కొనుగోలు సమస్యలను తెలుసుకుని సూచనలు అందిస్తున్నారని తెలిపారు.
Latest News