|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 11:14 PM
టెస్టు సిరీస్‌లో 0-2తో క్లీన్ స్పీప్‌కు గురైన టీమిండియా.. సీనియర్ల రాకతో వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 17 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది. సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ శతకం, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించారు. అయితే ప్రొటీస్ ముందు 350 పరుగుల లక్ష్యం నిలిపినప్పటికీ భారత్.. విజయం కోసం చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. భారత బౌలర్ల ఆశించిన మేర రాణించకపోవడంతో మ్యాచ్ చివరి వరకూ వెళ్లింది. దీంతో రెండో వన్డేకు ముందు భారత్.. తుది జట్టులో మార్పులు చోటు చేసుకునేలా కనిపిస్తున్నాయి.
చాలా రోజుల తర్వాత భారత జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ విఫలమయ్యాడు. 8 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఇక వాషింగ్టన్ సుందర్ సైతం పెద్దగా రాణించలేదు. ఆల్‌రౌండర్ కోటాలో జట్టులోకి వచ్చినా.. ఏ పాత్రకూ న్యాయం చేయలేకపోయాడు. బ్యాటింగ్‌లో 13 రన్స్ మాత్రమే చేసిన అతడు.. బౌలింగ్‌లో 3 ఓవర్లు వేసి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. దీంతో గైక్వాడ్‌తో పాటు.. వాషింగ్టన్ సుందర్‌పై రెండో వన్డేలో వేటు పడే అవకాశం ఉంది.
రుతురాజ్ గైక్వాడ్ ప్లేసులో స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ .. తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం. ఇక వాషింగ్టన్ సుందర్ ప్లేసులో పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పంత్ ఏడాది కాలంగా కేవలం ఒకే వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు. టెస్టులతో పోలిస్తే.. వన్డేల్లో అతడి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అందుకే పంత్‌కు బదులు కేఎల్ రాహుల్‌కు తాత్కాలిక సారథ్య బాధ్యతలు దక్కాయి. కానీ రెండో వన్డేలో మాత్రం పంత్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రెండో వన్డేకు భారత తుది జట్టు అంచనా..
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ
Latest News