|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 11:17 PM
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతోంది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక డిసెంబర్ 3న రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డే జరగనుంది. ఇక వన్డే సిరీస్ ముగిసిన వెంటనే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. 9వ తేదీన తొలి మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి దాదాపు వారం రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ భారత జట్టును మాత్రం ఇంకా ప్రకటించలేదు. గిల్ కారణంగానే జట్టు ప్రకటన ఆలస్యం అవుతోందని సమాచారం.
టీమిండియా టెస్ట్, వన్డే కెప్టెన్.. టీ20 జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో గాయపడ్డాడు. మెడ నొప్పి కారణంగా మధ్యలోనే మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత రెండో టెస్టుకు, వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే అతడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే అతడు మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడా? లేదా? అన్న విషయంపై క్లారిటీ వచ్చిందేకు మరింకొత సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే జట్టు ప్రకటన ఆలస్యం అవుతోందని సమాచారం.
మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో వైస్ కెప్టెన్ గిల్‌ను కచ్చితంగా ఆడించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోందట. మరో రెండు రోజుల్లోపు భారత జట్టు ప్రకటన ఉండే అవకాశం ఉంది. “ప్రస్తుతం గిల్ పరిస్థితి బాగుంది. వరుస ప్రయాణాలు చేసినా అతడు ఇబ్బంది పడటం లేదు. అతడిని తిరిగి భారత జట్టులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అలాగని అతడి విషయంలో తొందరపడట్లేదు. గిల్ 100 శాతం మ్యాచ్ ఫిట్‌నెస్ సాధిస్తేనే.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆడతాడు. అతడు త్వరగా ఫిట్‌నెస్ సాధించి.. జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నాం” అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్..
తొలి టీ20: డిసెంబర్ 09 - కటక్
రెండో టీ20: డిసెంబర్ 11 - ముల్లాన్‌పూర్
మూడో టీ20: డిసెంబర్ 14 - ధర్మశాల
నాలుగో టీ20: డిసెంబర్ 17 - లక్నో
ఐదో టీ20: డిసెంబర్ 19 - అహ్మదాబాద్
Latest News