|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 07:48 PM
ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సదుపాయాలు, సౌకర్యాలు కల్పించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ ఉంటుంది. ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. అలాగే ప్రయాణాల్లో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. క్షేమంగా గమ్యానికి చేర్చేలా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకుంటూ ముందుకు సాగుతుంటుంది ఆర్టీసీ. తాజాగా దూర ప్రాంత ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ఓ బంపరాఫర్‌తో ముందుకు వచ్చింది. ఇంద్ర ఏసీ బస్సు ఛార్జీలు తగ్గించింది. అయితే ఇది ఇన్ని రూట్లలోనూ కాదండోయ్.. కేవలం ఒక్క రూటులో మాత్రమే...
శ్రీకాకుళం విజయవాడ మార్గంలో నడిచే ఇంద్ర ఏసీబస్సు ఛార్జీలను ఏపీఎస్ఆర్టీసీ తగ్గించింది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం - విజయవాడ మార్గంలో తిరిగే ఇంద్ర ఏసీబస్సు ఛార్జీలను20 శాతం మేరకు తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం శ్రీకాకుళం - విజయవాడ ఇంద్ర ఏసీ బస్సు ఛార్జీ 928 రూపాయలుగా ఉంది. అయితే20 శాతం మేరకు తగ్గించడంతో ఈ ఛార్జీ ఇప్పుడు రూ.743 అవుతుందని అధికారులు చెప్తున్నారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని.. డిసెంబర్ 31 వరకూ అమల్లో ఉంటుందని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
మరోవైపు శ్రీకాకుళం - విజయవాడ (2967) ఇంద్ర ఏసీ బస్సు.. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు శ్రీకాకుళం నుంచి బయల్దేరుతుంది. అలాగే విజయవాడ - శ్రీకాకుళం ( 2968) బస్సు ప్రతిరోజూ రాత్రి 7 గంటల 15 నిమిషాలకు విజయవాడ నుంచి శ్రీకాకుళం బయల్దేరి వెళ్తుంది. ఈ రెండు బస్సులలో ప్రస్తుతానికి ఛార్జీలను తగ్గించారు. దూరప్రాంత ప్రయాణాలు చేసేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే చలికాలం కావటంతో ఏసీ బస్సులలో డిమాండ్ తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులను ఆకర్షించేందుకు అధికారులు ఛార్జీలను తగ్గించినట్లు సమాచారం. మరోవైపు జనవరి నెల ప్రారంభమైన తర్వాత సంక్రాంతి సీజన్ రానుండటంతో టికెట్ ఛార్జీలను మళ్లీ సాధారణంగా మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
Latest News