|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 07:46 PM
మొన్నటివరకు జనం సందోహంతో కిక్కిరిసిపోయిన శబరిమల, ఈరోజు మాత్రం అసాధారణంగా ఖాళీగా కనిపించింది. వర్చువల్ క్యూ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారిలో దాదాపు 15% మంది ఆలయానికి రాకపోవడంతో, గత రెండు రోజులుగా అయ్యప్ప దర్శనానికి రద్దీ గణనీయంగా తగ్గింది.స్పాట్ బుకింగ్ పరిమితిని పెంచుకోవచ్చని కేరళ హైకోర్టు సూచించినప్పటికీ, ఉదయం 5 గంటలనుంచే సన్నిధానంలోని నడపండాల్, పదునెట్టాంబడి (18 మెట్లు), ఆలయ ప్రాంగణం, మాలికాపురోత్తమ్మ మంజుమాత ఆలయం ప్రాంతాల్లో భక్తుల రద్దీ తక్కువగా ఉండటం ప్రత్యేకంగా గమనించబడింది.ఇటీవలి రోజుల వరకు 18వ మెట్టు ఎక్కడానికి క్యూలైన్ “ఇసుకేస్తే రాలనంత”గా ఉండేది. సగటున నిమిషానికి 85 మంది భక్తులు మెట్లు ఎక్కేవారు. అయితే సోమవారం మాత్రం ఆ క్యూలైన్లలో కూడా జనం తగ్గిపోయారు. పంపా నుంచి వచ్చిన భక్తులు వేచి ఉండకుండా నేరుగా మెట్లు ఎక్కి దర్శనం చేసుకునే అవకాశం లభిస్తోంది. ఉదయం 7.30 గంటలకు పూజ కారణంగా 18వ మెట్టును అరగంటపాటు మూసివేసినా కూడా పెద్దగా రద్దీ కనిపించలేదు.ఇదిలా ఉండగా, డిసెంబరు 27తో వర్చువల్ క్యూ బుకింగ్ పూర్తిగా ఫుల్ అయింది. ఇకపై మండలకాలం ముగిసే వరకు కొత్త స్లాట్లు బుక్ చేసుకునే అవకాశం లేదని సిస్టమ్‌లో ఎరుపు రంగుతో చూపిస్తోంది.ఇక హైకోర్టు ఆదేశాల మేరకు రోజువారీ రద్దీపై ఆధారపడి స్పాట్ బుకింగ్ అనుమతించాలని నిర్ణయించారు. ప్రస్తుతం స్పాట్ బుకింగ్ కౌంటర్లు నీలక్కల్, వండిపెరియార్ వద్ద మాత్రమే ఉన్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమయ్యే ఈ బుకింగ్ గంటలోపే పూర్తవుతోంది. దాంతో ఇరుముడితో వచ్చే యాత్రికులు నిరాశతో నీలక్కల్ పరిసరాల్లోనే తిరుగాల్సి వస్తోంది. గతేడాది ఇరుముడి ధరించిన వారిని ఎవరినీ వెనక్కి పంపకూడదన్న నిర్ణయంతో వ్యవహరించగా, ఈసారి ఆ విధానంలో మార్పు రావడం ప్రశ్నలు తెస్తోంది.దీని ఫలితంగా యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, మొత్తం భక్తుల రద్దీ మాత్రం తగ్గుముఖం పట్టింది. ఉదయం వరకు ఉన్న అధికారిక గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 12.13 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.
Latest News