|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 05:29 AM
రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 17 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 350 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు చివరి వరకు పోరాడినా, భారత బౌలర్ల ధాటికి తలవంచింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. విరాట్ కోహ్లీ అద్భుత శతకంతో పాటు, కుల్దీప్ యాదవ్ కీలక సమయంలో వికెట్లు పడగొట్టి విజయంలో ముఖ్య పాత్ర పోషించారు.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ ధాటికి 11 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రియాన్ రికెల్టన్ (0), క్వింటన్ డికాక్ (0) లను హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చగా, కెప్టెన్ మార్‌క్రమ్ (7) ను అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేశాడు. ఈ దశలో మాథ్యూ బ్రీట్జ్‌కే (72), టోనీ డి జోర్జి (39) నాలుగో వికెట్‌కు 66 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. దూకుడుగా ఆడుతున్న జోర్జిని కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ (37) వేగంగా ఆడినా, ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అయితే, మార్కో జాన్సెన్ (70) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బ్రీట్జ్‌కేతో కలిసి ఆరో వికెట్‌కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసుకునేలా కనిపించాడు. అయితే, ఒకే ఓవర్‌లో జాన్సెన్, బ్రీట్జ్‌కేలను ఔట్ చేసిన కుల్దీప్ యాదవ్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివర్లో కార్బిన్ బాష్ (67) కూడా అద్భుతంగా పోరాడాడు. సుబ్రాయెన్ (17), నండ్రే బర్గర్ (17)తో కలిసి చిన్నపాటి భాగస్వామ్యాలు నెలకొల్పి విజయానికి చేరువగా తెచ్చాడు. అయితే, ప్రమాదకరంగా పరిణమించిన బాష్ ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా, హర్షిత్ రాణా 3, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీశారు.అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్, విరాట్ కోహ్లీ (120 బంతుల్లో 135) అద్భుత శతకంతో కదం తొక్కాడు. రోహిత్ శర్మ (57), కెప్టెన్ కేఎల్ రాహుల్ (60) అర్ధ సెంచరీలతో రాణించారు. చివర్లో రవీంద్ర జడేజా (20 బంతుల్లో 32) మెరుపులు మెరిపించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు చేసింది.
Latest News