|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 11:16 PM
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను భారత్ విజయంతో ఆరంభించింది. రాంచీ వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా చివరి వరకూ విజయం కోసం పోరాడింది. చివరకు 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 17 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది.
350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. ర్యాన్ రికల్టన్ (0), క్వింటన్ డికాక్‌లను హర్షిత్ రాణా ఒకే ఓవర్‌లో ఔట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఎయిడెన్ మార్‌క్రమ్ (7) కూడా అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో 11 పరుగులకే ప్రొటీస్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
సౌతాఫ్రికాకు లభించిన స్టార్ట్ చూసి.. మ్యాచ్ త్వరగానే ముగిసేలా కనిపించింది. కానీ ఆ జట్టు బ్యాటర్లు మాత్రం అసాధారణ బ్యాటింగ్ చేశారు. మాథ్యూ బ్రీట్జ్ కే, డి జోర్జీ కలిసి నాలుగో వికెట్‌కు 62 బంతుల్లో 66 పరుగులు జోడించారు. ఆ తర్వాత బ్రెవిస్ (28 బంతుల్లో 37రన్స్) కూడా రాణించాడు. మాథ్యూ బ్రీట్జ్ కే (80 బంతుల్లో 72 రన్స్)తో పాటు మార్కో జాన్సెన్ మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. టీ20 తరహాలో రెచ్చిపోయి.. 39 బంతుల్లోనే 70 రన్స్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా అనూహ్యంగా పుంజుకుని మ్యాచ్‌లోకి వచ్చేసింది.
అయితే కీలకమైన సమయంలో భారత బౌలర్లు వికెట్లు తీయడంతో.. సౌతాఫ్రికాకు ఛేజింగ్ కష్టమైంది. కార్బిన్ బాష్ చివరి వరకూ పోరాడినా.. జట్టు మాత్రం గెలుపు గీతను దాటలేకపోయింది. చివరి ఓవర్‌లో ఆ జట్టు విజయానికి 18 పరుగులు అవసరం అయ్యాయి. కానీ చివరి ఓవర్ రెండో బంతికే ఆ జట్టు ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 17 పరుగుల తేడాతో గెలుపొందింది. కార్బిన్ బాష్ 51 బంతుల్లో 67 పరుగులు చేశాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియాను విరాట్ కోహ్లీ , రోహిత్, రాహుల్ ఆదుకున్నారు. కోహ్లీ సెంచరీ (135), రోహిత్ శర్మ (57), కేఎల్ రాహుల్ (60)హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్‌పూర్‌లో జరగనుంది.
Latest News