|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 09:46 PM
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, వారి మద్దతు కూడగట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వ విధానం 'పొలిటికల్ గవర్నెన్సు' అని, సంక్షేమ ఫలాలు అందించడమే కాకుండా నేతలు, కార్యకర్తలు నిరంతరం ప్రజలతో మమేకమై ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతల నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు అందరితో ఆయన ఆదివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలపై డిసెంబర్ నెల క్యాలెండర్‌ను విడుదల చేశారు.పెన్షన్ల పంపిణీ కార్యక్రమంపై చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ప్రతినెలా 1వ తేదీన ఎలాంటి ఆటంకం లేకుండా పెన్షన్లు అందిస్తున్నాం. కేటగిరీల వారీగా రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. వృద్ధులకు ఏటా రూ.48 వేలు, డయాలసిస్ రోగులకు రూ.1.20 లక్షలు, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ.1.80 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. ఇప్పటివరకు కేవలం పెన్షన్ల కోసమే రూ.50,763 కోట్లు ఖర్చు చేశాం. ఇది దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ కార్యక్రమం. గత 17 నెలలుగా నేనూ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఇంత మంచి చేస్తుంటే, చేసిన మంచిని వివరంగా చెబితే ప్రజలు ఇక కూటమితోనే ఉంటారు ఇతర పార్టీల వైపు చూడనే చూడరు అని ఆయన స్పష్టం చేశారు.పార్టీ కోసం త్యాగాలు చేసిన కార్యకర్తలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.పార్టీనే సర్వస్వంగా భావించి ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన కార్యకర్తలు ఎందరో ఉన్నారు. వారి సేవలను గుర్తిస్తున్నాం. పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవిస్తాం. కార్యకర్తల మనోభీష్టం మేరకే నాయకత్వం ముందుకు వెళుతుంది. మనకున్న 12 లక్షల మంది కుటుంబ సాధికార సారథులు, 46 వేల బూత్ కమిటీలు ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి" అని ఆయన పిలుపునిచ్చారు.గత ప్రభుత్వ వైఫల్యాలను, విధ్వంసాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. గత పాలకుల విధ్వంసం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. రాజకీయ కక్షతో నీరు-చెట్టు, ఉపాధి హామీ బిల్లులను కూడా నిలిపేశారు. మేం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్ఆర్ఈజీఎస్ బిల్లులను మంజూరు చేయించాం. ఇళ్ల పథకంలోనూ నిధులు దారి మళ్లించారు. వారి తప్పులను సరిదిద్దుతూ, ఉగాది నాటికి మరో 5 లక్షల ఇళ్లను పేదలకు అందిస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికీ సొంతింటి కలను నెరవేర్చడమే మా లక్ష్యం. ఈ విధ్వంసంపై ప్రజల్లో ఇంకా చర్చ జరగాలి" అని అన్నారు.డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల్లో వర్క్‌షాప్‌లు, 5వ తేదీన జరిగే మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ విధానాలను వివరించాలని ఆదేశించారు. కొన్నిచోట్ల అనర్హులు పెన్షన్లు పొందుతున్నారని, అయితే అర్హులైన ఒక్కరికి కూడా అన్యాయం జరగదని, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని చంద్రబాబు కోరారు.
Latest News