|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 08:29 PM
మానవత్వం, దయ వంటి సుగుణాలు కరువవుతున్న ప్రస్తుత సమాజంలో.. హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఒక దారుణమైన ఘటన ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. జీడిమెట్ల ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో.. నర్సరీ చదువుతున్న ఒక చిన్నారి పట్ల అదే స్కూల్‌కు చెందిన ఆయా అత్యంత కర్కశంగా.. పాశవికంగా ప్రవర్తించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో.. పిల్లలను ఆయాలకు, పాఠశాలలకు అప్పగించడానికి తల్లిదండ్రులు తీవ్రంగా భయపడిపోతున్నారు.
జీడిమెట్లలో ఏం జరిగింది.?
జీడిమెట్ల పరిధిలోని షాపూర్ నగర్‌లోని పూర్ణిమ స్కూల్‌లో ఈ దారుణం జరిగింది. శనివారం స్కూల్ ముగిసిన తర్వాత.. నర్సరీ చిన్నారిపై ఆయా విచక్షణారహితంగా దాడి చేసింది. చిన్నారిని ఇష్టానుసారం కొట్టడమే కాక.. ఆమెపై కాలు వేసి తొక్కుతూ దారుణంగా హింసించింది. ఆయా ఆ విధంగా పాశవికంగా దాడి చేస్తుండగా పక్క భవనంలో ఉన్న ఒక యువకుడు తన సెల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఇంటికి వచ్చిన బాలికకు తీవ్ర జ్వరం రావడంతో.. ఆమె తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. రాత్రి నుంచి బాలిక ఆహారం తీసుకోవడం మానేయడం.. తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఆ వీడియో వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ కావడంతో.. తల్లిదండ్రులు ఆ వీడియో ఆధారంగా జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాలికకు స్థానిక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
చిన్నారిపై జరిగిన పాశవిక దాడిని వైద్యులు కూడా ధ్రువీకరించారు. పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి.. ఆయాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పాఠశాల ప్రిన్సిపల్‌తో పాటు యాజమాన్యానికి కూడా నోటీసులు పంపారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని సీఐ వెల్లడించారు. ఇంతటి కర్కశమైన ఘటన జరిగినందుకు.. ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేసి, సీజ్ చేయాలని తల్లిదండ్రులు, స్థానికులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.
నేటి నగర జీవితంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తే తప్ప ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో.. ఇంట్లో పిల్లలను చూసుకునేందుకు పెద్దవారు లేనప్పుడు.. వేరే దారి లేక చిన్నపిల్లలను డేకేర్ సెంటర్లలో లేదా ఆయాల దగ్గర వదిలి వెళ్లక తప్పని పరిస్థితి. జీడిమెట్లలో జరిగిన ఈ ఘోరం.. ఉపాధి కోసం తాము తీసుకుంటున్న నిర్ణయం పిల్లల భద్రతకు ఏ విధంగా ముప్పు కలిగిస్తుందోనని ప్రతి తల్లిదండ్రులలోనూ భయాన్ని, ఆందోళనను పెంచింది. తమ పిల్లలను చూసుకునే బాధ్యత అప్పగించిన వ్యక్తులు ఇంత ఘోరంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నారో అర్థం కాక.. తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
పూర్ణిమ పాఠశాల ఘటనపై బాలల హక్కుల కమిషన్ స్పందన..
వివిధ సామాజిక మాధ్యమాల వేదికల ద్వారా.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పూర్ణిమ పాఠశాలలో ఒక మహిళా సహాయకురాలు (ఆయా) నర్సరీ చిన్నారిని అమానుషంగా హింసించిన సంఘటనపై తనకు ఎన్నో ఫిర్యాదులు అందాయని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు సరిత గోగుల చెప్పుకొచ్చారు. తాను వ్యక్తిగతంగా ఈ సమస్యను పరిశీలిస్తానని.. ఈ విషయంలో తక్షణమే దృష్టి సారించి.. కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తానన్నారు.
Latest News