|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 08:28 PM
యూరోపియన్ దేశం ఫిన్లాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్, అఫ్గానిస్తాన్, మయన్మార్‌లోని తమ రాయబార కార్యాలయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. వ్యూహాత్మక కారణాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిన్లాండ్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇస్లామాబాద్, కాబూల్, యాంగోన్‌లలోని తమ రాయబార కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించినట్లు ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయా దేశాలలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు, తమతో ఆయా దేశాల పరిమిత వాణిజ్య, ఆర్థిక సంబంధాలు, వ్యూహాత్మక కారణాల వలన రాయబార కార్యాలయాలు మూసివేయనున్నట్లు ఫిన్లాండ్ ప్రకటించింది. అలాగే మూడు దేశాల్లోని రాయబార కార్యాలయాలను మూసివేయడానికి సన్నాహాలను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపింది. 2026లోగా మూసివేస్తామని వెల్లడించింది.
మరోవైపు ఫిన్లాండ్ విదేశాంగ విధానం, భద్రతా విధానాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. అలాగే తమకు వ్యూహాత్మకంగా ముఖ్యమైన దేశాలపై దృష్టి పెడతామని ఫిన్లాండ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎలినా వాల్టోనెన్ తెలిపారు. మరోవైపు 2012లోనూ ఫిన్లాండ్ ఇలాగే పాకిస్తాన్‌లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. బడ్జెట్ పరిమితుల కారణంగా మూసివేసినప్పటికీ 2022లో మిషన్ తిరిగి ప్రారంభించారు. మరోవైపు 2023లో స్వీడన్ కూడా భద్రతా పరిస్థితిని కారణంగా చూపుతూ పాకిస్థాన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని నిరవధికంగా మూసివేసింది.
మరోవైపు ఫిన్లాండ్ అధ్యక్షుడు అలగ్జాండర్ స్టబ్ ఇటీవల భారతదేశంపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ న్యూఢిల్లీ సూపర్ పవర్‌గా ఎదుగుతోందని ఫిన్లాండ్ అధ్యక్షుడు ప్రశంసించారు. భారత్‌తో కలిసి పనిచేస్తామన్నారు. అలాగే భారతదేశాన్ని.. చైనా, రష్యాలతో కలిపి చూడకూడదని అభిప్రాయపడ్డారు. యూరోపియన్ యూనియన్‌కు భారత్ అత్యంత సన్నిహిత దేశమని..అమెరికాతోనూ మంచి సంబంధాలున్నాయన్నారు.
భారత్ ఎదుదుతున్న మహాశక్తి అని అభివర్ణించిన ఫిన్లాండ్ అధ్యక్షుడు.. భారత్‌కు జనాభా, ఆర్థిక వ్యవస్థ రెండూ కలిసొస్తున్నాయన్నారు. ఫిన్లాండ్ అధ్యక్షుడు స్టబ్ భారతదేశాన్ని ప్రశంసించడం.. పాకిస్థాన్‌లో రాయబార కార్యాలయాలను మూసివేయడం.. అదే సమయంలో వ్యూహాత్మకమైన దేశాలపై దృష్టిపెడతామని చెప్పడం తాజాగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Latest News