|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 08:25 PM
బ్రిటన్ రాజధాని లండన్ నగరంలో పాన్ ఉమ్మివేయడం ఒక ప్రధాన సమస్యగా మారింది. లండన్‌లోని బ్రెంట్ కౌన్సిల్.. ఈ పాన్ మరకల సమస్యపై ఒక వీడియోను విడుదల చేయగా.. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. పాన్ ఉమ్మివేయడం వల్ల వీధులు, భవనాలు, షాపుల ముందు భాగంలో ఏర్పడిన ముదురు ఎరుపు రంగు మరకలు, వాటిని శుభ్రం చేయడానికి అవుతున్న భారీ ఖర్చుకు సంబంధించి ఈ వీడియోలో స్పష్టంగా చూపించారు.
ఇక ఆ ఒక్క బ్రెంట్ కౌన్సిల్ పరిధిలోనే పాన్ ఉమ్మేసిన మరకలను తొలగించేందుకు ప్రతీ సంవత్సరం 30 వేల బ్రిటన్ పౌండ్లు అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ.31 లక్షల ఖర్చు అవుతోంది. దీనికి తోడు.. పాన్ మరకలు అసహ్యంగా కనిపిస్తున్నాయని.. కౌన్సిల్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లండన్‌లో మరీ ముఖ్యంగా దక్షిణాసియా నుంచి వచ్చినారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాన్ నమలడం, ఉమ్మివేయడం వల్ల వీధులు, ప్రభుత్వ బిల్డింగ్‌లు తీవ్రంగా దెబ్బతింటున్నాయని అధికారులు తెలిపారు.
తమ వీధుల్లో పేరుకుపోయిన ఈ ముదురు ఎరుపు రంగు పాన్ మరకలను శుభ్రం చేయడానికి ఏటా భారీగా ఖర్చు చేస్తుండటంతో.. ఈ ఖర్చు స్థానిక పన్ను చెల్లింపుదారులపై భారం మోపుతున్నారు. ఈ క్రమంలోనే బ్రెంట్ కౌన్సిల్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను విడుదల చేయగా.. అది వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మొండి పాన్ మరకలను కార్మికులు రుద్దుతూ కనిపించారు. పాన్ ఉమ్మివేసి వీధులను మురికి చేస్తున్న ప్రజలతో తమకు విసుగు వచ్చిందని.. ఇక చాలు అని అందులో వాయిస్ వినిపించింది.
కఠిన చర్యలకు సిద్ధం
ఇక ఈ పాన్ మరకల సమస్యను పరిష్కరించడానికి బ్రెంట్ కౌన్సిల్ కఠినమైన చర్యలకు ఉపక్రమించింది. వీధుల్లో ఇలా పాన్ మరకలను ఉమ్మివేసేవారిని పట్టుకోవడానికి మరింత మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లను నియమించింది. పాన్ ఉమ్మివేస్తూ పట్టుబడిన వారికి 100 బ్రిటన్ పౌండ్లు సుమారు రూ.12 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. పాన్ లేదా పొగ తాగడం మానేయాలి అనుకునే వారికి కౌన్సిల్ సహాయం చేయనుంది. పాన్ ఉమ్మివేయడం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయని.. పర్యావరణ పరిశుభ్రత పట్ల పౌరులు బాధ్యతగా ఉండాలని కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది.
మండిపడుతున్న నెటిజన్లు
బ్రెంట్ కౌన్సిల్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో.. నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బహిరంగ ప్రాంతాల్లో పాన్ ఉమ్మేసేవారిని పట్టుకుని.. ప్రజలకు ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండేందుకు వారికే ఒక బకెట్, స్పాంజ్ ఇచ్చి శుభ్రం చేయించాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఇలాంటి వారికి కఠిన శిక్షలు అవసరమని కౌన్సిల్‌కు చెబుతున్నారు. ఈ పాన్ సమస్యపై తక్షణ చర్య తీసుకోవాలని ఎక్కువ మంది నెటిజన్లు డిమాండ్ చేశారు.
Latest News