|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 08:23 PM
కొన్ని మహా వృక్షాలు కేవలం శతాబ్దాలు కాదు.. నాగరికతలను కూడా తట్టుకుని నిలబడతాయి. అవి భూమిపై అత్యంత ఎక్కువ కాలం జీవించిన జీవులుగా చారిత్రక సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. భౌగోళిక మార్పులు, ఎన్నో సామ్రాజ్యాల పతనాలను చూసిన ఈ పురాతన వృక్షాలు.. తమ వేర్ల వ్యవస్థల ద్వారా తరాలుగా పునరుత్పత్తి చెందుతున్నాయి. కొన్ని ఒకే మహా వృక్షంగా మారుతున్నాయి. ప్రపంచంలో అత్యంత పురాతనమైన ఆరు జీవన వృక్షాలు.. వాటి విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. స్వీడన్‌లోని ఒక మహా వృక్షం.. దాదాపు 10 వేల సంవత్సరాలుగా జీవించి.. ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత వివిధ దేశాల్లో వేల ఏళ్లుగా మహా వృక్షాలుగా కొనసాగుతున్నాయి.
ప్రపంచంలోని అత్యంత పురాతన వృక్షాలు
ఓల్డ్ టిక్కో – డాలర్నా, స్వీడన్
ఈ ఓల్డ్ టిక్కో అనే వృక్షం వయసు సుమారు 9,550 సంవత్సరాలు అని చెబుతారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన వృక్షంగా ఇది నిలిచింది. ఇది ఒకే బోదె చెట్టు కాకపోయినా.. అత్యంత పురాతనమైన జన్యుపరమైన వృక్షానికి సాక్ష్యంగా నిలిచింది. స్వీడన్ డాలర్నాలోని ఫుల్ఫియాలెట్ నేషనల్ పార్క్‌లో ఉన్న ఈ నార్వే స్ప్రూస్ చెట్టు.. క్లోనల్ ప్రక్రియ ద్వారా (వేర్ల వ్యవస్థ ద్వారా కొత్త కాండాలను ఉత్పత్తి చేయడం) జీవిస్తోంది. ఇప్పుడు కనిపించే కాండం చిన్నదే అయినప్పటికీ.. దాని వేర్ల వ్యవస్థ దాదాపు 10 వేల సంవత్సరాలుగా నిలిచి ఉందని పేర్కొంటున్నారు.
మెథుసెల – కాలిఫోర్నియా, అమెరికా
ఈ మెథుసెల అనే మహా వృక్షం వయసు 4,800 సంవత్సరాల కంటే ఎక్కువ అని చెబుతారు. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన క్లోనల్ (పునరుత్పత్తి) కాని ఏక వృక్షాల్లో ఈ మెథుసెల వృక్షం ఒకటి. ఇది అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఇన్యూ నేషనల్ ఫారెస్ట్‌లో, వైట్ మౌంటైన్స్‌లోని ఏన్షియంట్ బ్రిస్టిల్‌కోన్ పైన్ ఫారెస్ట్‌లో ఉంది. అయితే ఈ వృక్షాన్ని రక్షించడం కోసం.. అది కచ్చితంగా ఎక్కడ ఉంది అనే స్థానాన్ని మాత్రం అక్కడి అధికారులు బహిరంగంగా వెల్లడించలేదు.
అలర్స్ మిలేనియారియో – చిలీ
చిలీ దేశంలో ఉన్న ఈ అలర్స్ మిలేనియారియో వృక్షం వయసు సుమారు 5,484 సంవత్సరాలు. దీన్ని గ్రాన్ అబుఎలో అని కూడా పిలుస్తారు. చిలీ పటగోనియాలోని అలర్స్ కోస్టెరో నేషనల్ పార్క్‌లో ఉన్న ఈ అలర్స్ మిలేనియారియో వృక్షం.. అమెరికన్ రెడ్‌వుడ్ చెట్లతో పోల్చేంత భారీ స్థాయిలో ఉంటుంది.
సర్వ్ ఎ అబర్కు అబర్కు, ఇరాన్
ఇరాన్‌లోని అబర్కులో ఉన్న ఈ సర్వ్ ఎ అబర్కు అనే వృక్షం వయసు సుమారు 4 వేల సంవత్సరాలు ఉంటుందని వృక్ష శాస్త్ర పరిశోధకులు అంచనా వేస్తున్నారు. మధ్య ఇరాన్‌లోని యజ్ద్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ సర్వ్ ఎ అబర్కు వృక్షం ప్రత్యేతక ఏంటంటే.. ఇరాన్ అత్యంత విలువైన సహజ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది. ఇది ఒక ప్రఖ్యాత పర్షియన్ సైప్రస్ వృక్షం. దీని పురాతన కాండం కారణంగా కచ్చితమైన వయస్సును నిర్ధారించడం కష్టంగా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
జోమోన్ సుగి – యకుషిమా, జపాన్
జపాన్‌లోని యుకుషిమాలో ఉన్న ఈ జోమోన్ సుగి వృక్షం వయసు 2,170 ఏళ్ల నుంచి 7,200 సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన యకుషిమా ద్వీపంలో ఉండటం ఈ వృక్షం ప్రత్యేకత. ఈ జోమోన్ సుగి.. ఆ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన, పురాతనమైన క్రిప్టోమెరియా (జపనీస్ సెడార్). ఈ చెట్టును చూడటానికి సుదీర్ఘంగా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.
వూవెస్ ఆలివ్ వృక్షం – క్రీట్, గ్రీస్
గ్రీస్ దేశంలో ఉన్న ఈ వూవెస్ ఆలివ్ వృక్షం వయసు.. కనీసం 2 వేల ఏళ్ల నుంచి 3 వేల సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. క్రీట్‌లోని అనో వూవెస్ గ్రామంలో ఉన్న ఈ పురాతన ఆలివ్ చెట్టు ఇప్పటికీ పండ్లను అందిస్తుండటం విశేషం. దీని వయసు 2 వేల ఏళ్లకు పైనే ఉందని ట్రీ రింగ్ విశ్లేషణ ద్వారా శాస్త్రవేత్తలు ధృవీకరించారు. దీని వంకర కాండం శతాబ్దాల సహజ వాతావరణ మార్పులను ప్రతిబింబిస్తుంది.
Latest News