|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 08:40 PM
పదండి ముందుకు.. పదండి తోసుకు.. పోదాం పోదాం పైపైకి.. అని పెద్దాయన శ్రీశ్రీ ఏ ఉద్దేశంతో అన్నారో కానీ.. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ఈ లైన్ మదిలో మెదలడం ఖాయం.. డోర్ వద్ద తోసుకుని పైకి ఎక్కడం పూర్తి అయితే.. ఫెవికాల్ కూడా అతికించని ఓ బంధం మనల్ని చుట్టేస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలను భాగస్వామితో కాకుండా వేరొకరితో పంచుకోవడం బహుశా ఆర్టీసీ బస్సుల్లోనే సాధ్యమేమో.. గజిబిజి బతుకుల ఉరుకుల పరుగుల జీవితంలో.. నగరవాసికి ఇదో అనుభవించక తప్పని పరిస్థితి. మహిళా సాధికారత కోసమంటూ ప్రభుత్వాలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం మొదలుపెట్టిన తర్వాత.. సాధికారిత మాట అటుంచితే.. బస్సులో సీట్ల కోసం ఫీట్లు మాత్రం కామన్ అయ్యాయి. మహిళామణులు పోట్లాటలు, తిట్ల దండకాలు, కండక్టర్, డ్రైవర్లతో వాగ్వాదాలు.. మొదట్లో కాస్త వింతగా అనిపించినా.. రానురానూ జనం వాటికి అలవాటు పడుతున్నారు.
అయితే ఇన్ని రోజులు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళల మధ్య పోరాటం చూసిన కళ్లకి.. తాజాగా కాకినాడ జిల్లాలో జరిగిన ఘటన కాస్త ఆశ్చర్యంగా, మరికొంత ఆందోళనకరంగా అనిపించక మానదు. ఎందుకంటే తమ సీట్లో కూర్చున్నారంటూ ఇన్ని రోజులు ఆడోళ్లు, జుట్లు పట్టుకుని కొట్టుకోవడం చూసుంటాం. కానీ తొలిసారిగా.. ఇద్దరు మహిళలు కలిసి ఓ పురుషుణ్ని ఇంకా వివరంగా చెప్పాలంటే ఓ ప్రయాణికుణ్ని చితకబాదారు. తాము కర్ఛీఫ్ వేసిన సీట్లో కూర్చున్నాడనే కోపంతో ఇద్దరు మహిళలు.. ఆ ప్రయాణికుడితో వాగ్వాదం పెంచుకుని.. ఆవేశంలో అతని జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టారు. ఈ ఘటన తుని - నర్సీపట్నం ఆర్టీసీ బస్సులో చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే మహిళలు కర్చీఫ్ వేసిన సీట్లో ఆ వ్యక్తి కూర్చున్నట్లు తెలిసింది. దీంతో వీరి మధ్య తొలుత వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదం తర్వాత దాడుల వరకూ వెళ్లింది. దీంతో కోపంలో రెచ్చిపోయిన మహిళా ప్రయాణికులు.. అతని జుట్టు పట్టుకుని లాగి చితకబాదారు. దీంతో ప్రయాణికులు అందరూ విస్తుపోయారు. ఏం జరుగుతోందోననే భయంతో చూస్తుండిపోయారు. అయితే ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజనం భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.
ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సులో రద్దీ పెరిగిందని.. అందుకు అనుగుణంగా సీట్లు ఉండటం లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సర్దుకుపోయి ప్రయాణం చేయాల్సింది పోయి ఇలా తగవులు పడటం మంచిది కాదని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఆడోళ్లు ఆడోళ్లు కొట్లాడుకున్నారని.. ఇప్పుడు మగవారిపై దాడి చేయడం మొదలుపెడితే పరిస్థితి ఎక్కడికి వెళ్తుందోనంటూ మరికొంతమంది నెటిజనం ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇలాంటి ఘటనల్లో రెండు పక్షాల వాదనలు వినకుండా ఓ నిర్ణయానికి రాకూడదని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు.