|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 07:37 PM
అనుమానం పెనుభూతం అని చాలా మంది పెద్దలు అంటుంటే వినే ఉంటారు. అది ఒక్కసారి మనసులోకి ఎక్కితే.. ఎంతకూ మానని పుండులా తయారవుతుంది. ఈ వ్యాధి ఉన్న వారు సంతోషంగా ఉండకుండా.. ఇతరుల సంతోషానికి కూడా విఘాతం కలిగిస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా తీస్తారు. అలాంటి ఘటనే తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. అనుమానంలో ఓ భర్త.. భార్యను కిరాతకంగా చంపాడు. అనంతరం మృతదేహంతో సెల్ఫీ దిగి పోస్టు చేశాడు. మోసం చేనందుకు తగిన మూల్యం చెల్లించుకున్నావని క్యాప్షన్ పెట్టాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరునల్వేలికి చెందిన నిందితుడు బాలమురుగన్, శ్రీప్రియకు పెళ్లి అయింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. అయితే ఈ మధ్య కాలంలో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. తరచూ గొడవ పడేవారు. దీంతో భర్తతో విసిగిపోయిన శ్రీప్రియ.. కోయంబతూరులోని ఓ విమెన్స్ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేసుకుంటోంది. అయితే తన భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని బాలమురుగన్ అనుమానించాడు. క్రమంగా ఆ అనుమానాన్ని పెంచుకున్నాడు.
ఆ అనుమానంతోనే శ్రీప్రియ ఉంటున్న హాస్టల్‌కు వెళ్లాడు. తనతో రావాలని శ్రీప్రియను అడిగాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన బాలమురుగన్ తన వెంట తెచ్చుకున్న కొడవలి తీసుకుని.. కిరాతకంగా నరికి చంపాడు. భార్యను అతి కిరాతకంగా నరికి చంపి.. మృతదేహంతో సెల్ఫీ దిగాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్య శవం పక్కన కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. అనంతరం సెల్ఫీని పోస్ట్ చేస్తూ.. ద్రోహానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే అని క్యాప్షన్ పెట్టాడు.
కాగా, హత్యపై హాస్టల్‌లో ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఏమాత్రం తప్పు చేశాననే పశ్చాత్తాపం లేకుండా.. పోలీసులు వచ్చేవరకు నిందితుడు బాలమురుగన్ అక్కడే కూర్చోవడం గమనార్హం. అనంతరం పోలీసుల అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఈ ఏడాది ఆగస్టులో వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తన భార్య స్వాతిని కిరాతకంగా హతమార్చాడు. వివాహేతర సంబంధం అనే అనుమానంతో చంపి.. రంపంతో మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. అనంతరం శరీర భాగాలను కవర్లలో ప్యాక్ చేసి బయట పడేయడానికి రెడీ అయ్యాడు. ఈ క్రమంలో వచ్చిన వింత శబ్దాలు రావడంతో పక్కింటి వారు అనుమానించి లోపలికి వెళ్లి చూడగా.. ఘోరం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.
Latest News