|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 07:41 PM
తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.. తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ బస్సు ప్రమాదంలో కనీసం 10 మంది మరణించారు. మరో 20 మందికి తీవ్ర గాయాలు కాగా.. దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుమ్మంగుడి సమీపంలో రెండు ప్రభుత్వ బస్సులు ఎదురెదురుగా రాగా.. అతి వేగంతో ఢీకొనడం వల్ల ఈ విషాదం చోటుచేసుకుంది. వారం రోజుల్లో దక్షిణ తమిళనాడులో ప్రభుత్వ, ప్రైవేట్ బస్సుల మధ్య జరిగిన రెండో ఘోర ప్రమాదంగా ఇది నిలిచింది. గత వారం తెన్‌కాశి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మరణించారు.
తిరుపత్తూర్ ప్రాంతంంలో పిళ్లయార్‌పట్టికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రమాదానికి కారణమైన బస్సుల్లో.. ఒక బస్సు తిరుప్పూర్ నుంచి కారైకుడి వైపు వెళ్తుండగా.. మరొక బస్సు కారైకుడి నుంచి దిండిగల్ జిల్లా వైపు వెళ్తోంది. ఈ రెండు బస్సులు వేగంగా వచ్చి.. ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు వెల్లడించారు.
ఇక ఈ బస్సు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఇతర ప్రయాణికులు అలర్ట్ అయ్యారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బస్సుల్లో చిక్కుకుపోయిన బాధితులను బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో రెండు బస్సుల ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ఒక బస్సు డ్రైవర్ వైపు భాగం పూర్తిగా చీలిపోయినట్లు పేర్కొన్నారు. ప్రాథమికంగా వచ్చిన సమాచారం ప్రకారం.. 10 మంది ప్రయాణికులు మరణించారని.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఇక ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా వేగంగా డ్రైవింగ్ చేయడం లేదా ఒక బస్సు అదుపు తప్పడం వంటి కారణాలు ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
దక్షిణ తమిళనాడు ప్రాంతంలో బస్సులకు ప్రమాదం జరగడం.. గత వారం రోజుల్లో ఇది రెండవసారి కావడం గమనార్హం. కొన్ని రోజుల క్రితమే తెన్‌కాశి జిల్లాలో 2 ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఆ ఘటనలో ఆరుగురు మరణించారు. అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం కారణంగానే ఆ ప్రమాదం జరిగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. రవాణా శాఖ అధికారులు రోడ్డు భద్రతా నిబంధనలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Latest News