|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 07:36 PM
జమియత్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షడు మౌలానా మహ్మూద్ మదానీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మైనార్టీలపై అణచివేత జరిగితే.. భారత్‌లో జీహాద్ జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మైనార్టీ హక్కులను తక్కువ చేస్తోందని.. బాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్ వంటి తీర్పులు చూస్తే.. న్యాయవ్యవస్థపై ప్రభుత్వ ఒత్తిడి ఉందనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో మైనార్టీలకు పొందుపర్చిన హక్కులను బహిరంగంగా ఉల్లంఘించారన్నారు. ఈ మధ్య కాలంలో ఇలా మైనార్టీ హక్కులను తక్కువచేసే తీర్పులు చాలా వచ్చాయన్నారు. మైనార్టీల హక్కులు, న్యాయ వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మదానీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రార్థన స్థలాల చట్టం ఉన్నప్పటికీ కేసుల విచారణ తీరును మదానీ తప్పుపట్టారు. రాజ్యాంగాన్ని కాపాడుతున్నంతసేపు మాత్రమే సుప్రీంకోర్టు.. సుప్రీంగా (అత్యున్నతంగా) ఉంటుందని చెప్పారు. అలా జరగనప్పుడు అది సుప్రీం కాదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "సమాజంలో జీహాద్‌ను వక్రీకరిస్తున్నారు. ప్రభుత్వం, మీడియా కలిసి ఈ పవిత్ర విధానాన్ని వక్రీకరిస్తున్నాయి. లవ్ జీహాద్, ల్యాండ్ జిహాద్, స్పిట్ జీహాద్.. వంటి పదాలను వాడటం తప్పు. జీహాద్ ఎప్పటికీ పవిత్రమైనదే. ఇతరుల మంచి కోసమే జీహాద్ జరుగుతుంది. అణిచివేయాలని చూస్తే జీహాద్ జరగక తప్పదు" అని మదానీ హెచ్చరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
'మేము వందేమాతరం పాడము..'
ఇవే కాకుండా మరిన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు మహ్మూద్ మదానీ. ముస్లింలు రాజ్యాంగానికి విధేయులై ఉంటారని చెప్పిన మదానీ.. వందేమాతరం పాడటాన్ని కూడా విమర్శించారు. వలం చేతకాని సామాజిక వర్గమే లొంగిపోతుందని.. వందేమాతరం పాడమని అడగ్గానే పాడేది అలాంటి వారేనని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్న వేళ.. మదానీ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
మదానీకి బీజేపీ స్ట్రాంగ్ వార్నింగ్..
మదానీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ముస్లింలను రెచ్చగొట్టేందుకు మదానీ ప్రయత్నించారని, రాజ్యాంగబద్ధ సంస్థలను సవాల్ చేశారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ. దేశంలో కొత్త జిన్నాలు పుట్టుకొచ్చి.. ముస్లింలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మదానీ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సుమోటోగా పరిగణించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మదానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని.. సుప్రీం కోర్టునే సవాల్ చేశారని ధ్వజమెత్తారు. మదానీ వంటి వ్యక్తులే.. ఉగ్రవాదులు, జీహాదీలు, రేపిస్టులను తయారు చేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేసి.. అమాయకులను చంపితే సుప్రీంకోర్టు బహుమానాలు ఇవ్వాలా అంటూ మండిపడ్డారు. మదానీ లాంటి వాళ్లకు సుప్రీంకోర్టు ఉరేస్తుంది అని తీవ్రంగా హెచ్చరించారు. తప్పుడు ప్రవర్తనను మదానీ అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
జమియత్ ఉలేమా ఇ హింద్ భారతదేశంలోని పురాతన, అత్యంత ప్రభావవంతమైన ఇస్లామిక్ సంస్థలలో ఒకటి. దీన్ని 1919లో ముస్లిం సామాజిక, మత, రాజకీయ ఆందోళనలకు ప్రాతినిధ్యం వహించడానికి స్థాపించారు. ఈ సంస్థ.. ముస్లిం సంక్షేమం, విద్య, చట్టపరమైన హక్కులు వంటి అంశాలపై పనిచేస్తుంది. అలాంటి సంస్థ అధ్యక్షుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Latest News