|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 07:33 PM
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరితో పాటు మరి కొందరుకాంగ్రెస్ నేతలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుల్లో సోనియా, రాహుల్ గాంధీతో పాటు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడా ఉన్నారు.
అంతేకాకుండా యంగ్ ఇండియా సంస్థ, డోటెక్స్ మెర్చండైజ్ లిమిటెడ్, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) తదితర సంస్థలతో పాటు డోటెక్స్ ప్రోమోటర్ సునిల్ భండారిపై కూడా ఎఫ్ఐఆర్‌లో అభియోగాలు మోపారు. నిందితులపై నేరపూరిత కుట్ర, మోసం, ఆస్తుల దుర్వినియోగం మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి.. ఈడీ పీఎమ్ఎల్ఏ చట్టంలోని సెక్షన్ 66(2) ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు.
నిందితులందరూ కుట్రపూరితంగా కేవలం రూ. 50 లక్షలు మాత్రమే చెల్లించి.. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ. 2వేల కోట్ల విలువైన ఆసులపై అధికారాన్ని పొందారని ఈడీ ఆరోపించింది. అయితే నిందితుల్లో మోతీలాల్ వోరా 2020లో మృతిచెందారు, ఆస్కార్ ఫెర్నాండెజ్ 2021లో మరణించిన విషయం తెలిసిందే. కాగా, అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికను.. కాంగ్రెస్ పార్టీ రూ. 90 కోట్ల లోన్ అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకుంది. అయితే రాహుల్, సోనియాకు మెజార్టీ వాటా ఉన్న యంగ్ ఇండియా.. కేవలం రూ. 50 లక్షలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెల్లించి ఏజేఎల్‌ను సొంతం చేసుకొన్నట్లు ఛార్జిషీట్‌లో ఈడీ ఆరోపించింది. అంతేకాకుండా వివిధ మార్గాల ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డారని పేర్కొంది.
ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకునే విషయంపై నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు.. డిసెంబర్ 16కు వాయిదా వేసింది. ఏజేఎల్‌కు చెందిన సుమారు రూ. 2 వేల కోట్లు విలువైన ఆస్తుల్ని.. నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తుండగా.. తమపై రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని నిందితులు వాదిస్తున్నారు. ఏజేఎల్‌ను యంగ్ ఇండియన్ సంస్థ విలీనం చేసుకోవడం.. నేషనల్ హెరాల్డ్ సంస్థను పునరుద్ధరించేందుకేనని చెబుతున్నారు. అంతేకాకుండా, ఈడీ.. బీజేపీ కూటమి పార్టనర్ అని ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాగా, నేషనల్ హెరాల్డ్ వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి 2014 జూన్‌లో ప్రైవేటు కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Latest News