|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 07:32 PM
పిల్లలు ఎంత సున్నితంగా ఉంటారో అందరికీ తెలిసిందే. వారు తప్పు చేస్తున్నారనీ, దారిలో పెట్టాలని.. దండించడం, నిందించడం సరైన మార్గం కాదు. పిల్లలను అర్థం చేసుకుని చెప్పాల్సిన రీతిలో చెప్పాలి. కొంచెం అటు ఇటు అయినా.. వారు మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఓ విద్యార్థి పొరపాటు చేశాడని.. అతడి తండ్రిని పాఠశాలకు పిలిపించింది యాజమాన్యం. బాలుడు తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడినా.. స్కూల్ ప్రిన్సిపాల్ మాటలకు మనస్తాపానికి గురయ్యాడు. అనంతరం స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.
స్కూల్ యాజమాన్యం చెప్పిన వివరాల ప్రకారం, విద్యార్థి పాఠశాలకు తన మొబైల్ ఫోన్ తీసుకువచ్చాడు. క్లాస్‌రూమ్‌లో వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. స్కూల్ యాజమాన్యం ఈ వీడియోను చూసి శుక్రవారం (నవంబర్ 28) అతడి తండ్రిని పాఠశాలకు పిలిపించారు. బాలుడి తండ్రి పాఠశాల వెయిటింగ్ ఏరియాలో కూర్చున్నారు.
ఇంతలో బాలుడు ప్రిన్సిపాల్ గదికి వెళ్లినట్లు సీసీటీవీలో కనిపించింది. బాలుడు ఆ గదిలో దాదాపు నాలుగు నిమిషాల పాటు ఉన్నాడు. ఈ క్రమంలో తాను చేసిన తప్పుకు.. భయపడుతూ 52 సార్లు క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది. అయినా ప్రిన్సిపాల్.. తన కెరీర్‌ను అంతం చేస్తానని బెదిరించినట్లు బాలుడు ఆ తర్వాత చెప్పాడు. స్కూల్ నుంచి సస్పెండ్ చేసి.. మెడల్స్ అన్నీ తీసేసుకుంటామని ప్రిన్సిపాల్ అన్నట్లు తెలిపాడు. ఇప్పటికే స్కేటింగ్‌లో జాతీయ స్థాయిలో రెండు సార్లు పతకాలు సాధించిన బాలుడు.. ప్రిన్సిపాల్ అన్న మాటలకు తీవ్రంగా కలత చెందాడు. అనంతరం స్కూల్ కారిడార్‌లో పరిగెత్తుకుంటూ వచ్చి మూడో అంతస్తు నుంచి దూకేశాడు.
ఈ ఘటన జరిగినప్పుడు బాలుడి తండ్రి పాఠశాలలోనే ఉన్నా.. ఏం జరిగిందో అతడికి తెలియలేదు. కాగా, ఈ ఘటనపై ఎస్‌డీఎం ఆర్చి హరిత్ స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అయితే విద్యార్థిపై పాఠశాల యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ముందు.. అతడి తల్లిదండ్రులతో మాట్లాడటానికి ప్రయత్నించిందని తెలుస్తోంది. అంతలోనే ప్రిన్సిపాల్ కోప్పడటం, బాలుడు భయంతో అతిగా స్పందించడం.. ఈ పరిస్థితికి దారితీసింది. ఇక ఈ పరిస్థితిని పాఠశాల యాజమాన్యం హ్యాండిల్ చేసిన తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టే క్రమంలో.. టీచర్ల కఠిన వైఖరి కూడా ఇలాంటి పిల్లలు ఇలా అతిగా స్పందించడానికి కారణమవుతోందని అంటున్నారు. పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకుని టీచర్లు వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.