|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 05:26 PM
టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో అద్భుత శతకంతో కదం తొక్కాడు. మైదానం నలువైపులా క్లాస్ షాట్లతో అలరించిన కోహ్లీ, సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించిన అతను, 112 బంతుల్లో 11 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సహాయంతో 132 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నాడు. కోహ్లీ వీరవిహారంతో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (18) దూకుడుగా ఆడే క్రమంలో త్వరగా ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ (57) కేవలం 51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో వేగంగా అర్ధశతకం పూర్తి చేశాడు. ఈ జోడి రెండో వికెట్‌కు 136 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది.అయితే, రోహిత్ ఔటైన తర్వాత భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో జట్టుపై కాస్త ఒత్తిడి పెరిగింది. ఈ క్లిష్ట సమయంలో విరాట్ కోహ్లీ తన అనుభవాన్నంతా ఉపయోగించి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (19 బ్యాటింగ్)తో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం సంయమనం కోల్పోకుండా తన క్లాస్ బ్యాటింగ్‌తో స్కోరు వేగాన్ని కొనసాగించాడు.దక్షిణాఫ్రికా బౌలర్లలో ఒట్నీల్ బార్ట్‌మన్ రెండు వికెట్లు తీయగా, మార్కో యన్సెన్, నాండ్రే బర్గర్ చెరో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం 40 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. కోహ్లీ క్రీజులో ఉండటంతో టీమిండియా భారీ స్కోరు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
Latest News