|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 05:21 PM
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దంతెవాడ జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న 'లోన్ వర్రాటు', 'పూనా మర్గం' పథకాలకు ఆకర్షితులై 37 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. వీరిలో 27 మందిపై మొత్తం రూ. 65 లక్షల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు.హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ పునరావాస విధానంపై తమకు పూర్తి నమ్మకం ఉందని లొంగిపోయిన మావోయిస్టులు పేర్కొన్నారు. దంతెవాడలోని డీఆర్‌జీ కార్యాలయంలో పోలీసు, సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారుల సమక్షంలో వీరు లొంగిపోయారు. వీరిలో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ మాట్లాడుతూ మా నిరంతర ప్రయత్నాలు, స్థానిక ప్రజల మద్దతు ఫలించాయి. అడవుల్లో జీవించడం కష్టంగా మారిందని, పోలీసులు అన్ని ప్రాంతాలకు చేరుకుంటున్నారని, గ్రామస్తుల నుంచి కూడా మద్దతు లభించడం లేదని లొంగిపోయిన వారు చెబుతున్నారు" అని వివరించారు. లొంగిపోయిన వారిలో కొందరు సీనియర్ మావోయిస్టు కమాండర్లకు బాడీగార్డులుగా పనిచేసిన వారు కూడా ఉన్నారని తెలిపారు.ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం లొంగిపోయిన వారికి రూ. 50,000 ఆర్థిక సాయంతో పాటు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ, వ్యవసాయ భూమి వంటి అదనపు ప్రయోజనాలు అందిస్తారు. గత 20 నెలల్లో దంతెవాడ జిల్లాలో 165 మంది రివార్డు ఉన్న మావోయిస్టులతో సహా మొత్తం 508 మంది లొంగిపోయారని అధికారులు తెలిపారు. ఈ పరిణామం హింసారహిత బస్తర్ దిశగా వేసిన మరో కీలక అడుగు అని వారు అభివర్ణించారు.
Latest News