|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 10:26 PM
దిత్వా తుపాన్ ప్రభావంతో రాబోయే రెండు రోజులుగా దక్షిణ కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నవంబర్ 30న ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు మరియు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.డిసెంబర్ 1వ తేదీన ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత ఆదేశాల ప్రకారం అత్యవసర సహాయక చర్యల కోసం కడపలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వెంకటగిరి ప్రాంతంలో 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు.విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తుఫాన్ గమనాన్ని పర్యవేక్షిస్తూ, ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని ఎల్లప్పుడూ అలెర్ట్‌లో ఉంచుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలో ఉన్న మత్స్యకారులను రప్పించి, రైతులు భారీ వర్షాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదల కోసం లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Latest News