|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 10:25 PM
యాషెస్ సిరీస్‌ను భారీ ఓటమితో ఆరంభించిన ఇంగ్లాండ్‌కు రెండో టెస్టు ప్రారంభానికి ముందు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు ప్రధాన పేసర్ మార్క్‌వుడ్ గబ్బా టెస్టుకు దూరమయ్యాడు! కొన్ని నెలలుగా గాయంతో బాధపడుతున్న మార్క్‌వుడ్.. యాషెస్ తొలి టెస్టులోనూ పెద్దగా బౌలింగ్ చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే రెండో టెస్టు నాటికైనా అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించి.. సత్తాచాటుతాడని ఇంగ్లాండ్ భావించింది. కానీ ఆ జట్టుకు నిరాశే ఎదురైంది.
మార్క్‌వుడ్ మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకోలేదని సమాచారం. అతడు దూరం కావడం ఇంగ్లాండ్ జట్టుకు నిజంగా ఎదురుదెబ్బ లాంటిదే. ఎందుకంటే రెండో టెస్టు మ్యాచ్ పింక్‌బాల్ టెస్ట్. డే నైట్ టెస్టులో అతడు ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తాడని.. పదునైన స్వింగ్, లైన్ అండ్ లెంగ్త్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్లను వుడ్ బోల్తా కొట్టిస్తాడని ఇంగ్లీష్ జట్టు ఆశలు పెట్టుకుంది. కానీ అది సాధ్యం కావట్లేదు. డిసెంబర్ 4 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు మార్క్‌వుడ్ ప్లేసులో జోష్ టంగ్.. ఇంగ్లాండ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక యాషెస్ సిరీస్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. రెండు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో జయభేరీ మోగించింది. 104 ఏళ్ల చరిత్రలో యాషెస్ టెస్టు ఇంత త్వరగా పూర్తవ్వడం ఇదే మొదటిసారి. ఇక తొలి టెస్టు ఫలితంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరోవైపు రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. గాయం నుంచి కోలుకోకపోవడంతో ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యారు.
రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు..
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, బ్రెండన్ డాగెట్, కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మైకేల్ నీజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెధరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్.
Latest News