|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 10:26 PM
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు.. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు! ఈ ఏడాది జరిగే వేలంలో తాను అందుబాటులో ఉండటం లేదని, పేరు రిజిస్టర్ చేసుకోవడం లేదని వెల్లడించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అయితే ఐపీఎల్‌కు బదులుగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో ఆడతానని చెప్పాడు. ఐపీఎల్‌లో డుప్లెసిస్ గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఐపీఎల్‌లో తాను 14 సీజన్లు ఆడానని, ప్రపంచస్థాయి క్రీడాకారులతో ఆడే అదృష్టం ఈ లీగ్ ద్వారా దక్కిందని డుప్లెసిస్ రిటైర్మెంట్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఐపీఎల్ 19వ సీజన్‌కు ముందు జరగనున్న మినీ వేలానికి ముందు అతడు ఈ ప్రకటన చేశాడు.
“14 ఏళ్లు ఐపీఎల్ ఆడా. ఈసారి మాత్రం ఐపీఎల్ వేలంలో నా పేరు రిజిష్టర్ చేసుకోవడం లేదు. ఐపీఎల్ వంటి లీగ్‌లో ఆడకపోవడం అనేది చాలా పెద్ద నిర్ణయం. నా క్రికెట్ కెరీర్‌లో ఈ లీగ్ పాత్ర మరువలేనిది. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో ఆడటం, అద్భుతమైన ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించడం, క్రికెట్‌ను ఎంతో ప్రేమించే అభిమానుల ముందు ఆడడం అదృష్టంగా భావిస్తున్నా. భారత్ నాకు చాలామంది స్నేహితులను ఇచ్చింది. ఎన్నో జీవిత పాఠాలను, మధుర జ్ఞాపకాలను నాకు మిగిల్చింది. అన్నిటికంటే ముఖ్యంగా క్రికెటర్‌గా, వ్యక్తిగా నన్ను ఎంతో మార్చింది” అని డుప్లెసిస్ చెప్పాడు.
“నా ఈ ప్రయాణంలో మద్దతు తెలిపిన కోచ్‌లు, సహచరులు, సహాయక సిబ్బంది, అభిమానులకు కృతజ్ఞతలు. అలా అని నేను మొత్తానికి ఐపీఎల్‌కు వీడ్కోలు పలకలేదు. మళ్లీ నన్ను ఐపీఎల్‌లో చూస్తారు. ఈసారి మాత్రం కొత్త సవాల్ సవాల్ స్వీకరించాలని అనుకుంటున్నా. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు సిద్ధం అవుతున్నా,” అని ఫాఫ్ డుప్లెసిస్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
ఇక ఐపీఎల్‌లో డుప్లెసిస్ మొత్తంగా 154 మ్యాచ్‌లు ఆడాడు. 135.79 స్ట్రైక్‌రేట్‌తో 4,773 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో అతడు నాలుగు జట్ల తరఫున ఆడాడు. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్లు ఉన్నాయి. ఇక అబుదాబీ వేదికగా డిసెంబర్ 16న ఐపీఎల్ మినీ వేలం జరగనుంది.
Latest News