|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 10:27 PM
భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. జార్ఖండ్‌లోని రాంచీ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే రెండు జట్లు రాచీ చేరుకున్నాయి. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఈ సిరీస్‌లో సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. టెస్ట్, టీ20లకు గుడ్‌బై చెప్పిన వీరిద్దరూ.. కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానుల కళ్లన్నీ వీరిపైనే ఉన్నాయి.
ఇక సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఆడాడు. తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయినా.. మూడో వన్డేలో మాత్రం అజేయ హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చాడు. దీంతో సౌతాఫ్రికాతో సిరీస్‌లో అదరగొట్టాలని అతడు భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ సిరీస్‌కు ముందు ఓ అరుదైన రికార్డుపై విరాట్ కన్నేశాడు. రాంచీలో కోహ్లీ శతక్కొట్టాడంటే.. ఒక ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేయనున్నాడు.
ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ టెస్టుల్లో 51 సెంచరీలు చేశాడు. ఇక వన్డేల్లో విరాట్ కోహ్లీ 51 సెంచరీలు చేశాడు. కోహ్లీ.. మరొక్క సెంచరీ కొడితే.. ఓ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలుస్తాడు. అతడి ఖాతాలో 52 సెంచరీలు అవుతాయి. టెస్ట్, వన్డే ఏ ఫార్మాట్‌లో అయినా ఓ ప్లేయర్ చేసిన అత్యధిక సెంచరీలు ఇవే అవుతాయి. ఇక కోహ్లీ మరో 337 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగులు పూర్తి చేసుకుంటాడు.
దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.
భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ షెడ్యూల్..
తొలి వన్డే: నవంబర్ 30 - రాంచీ
రెండో వన్డే: డిసెంబర్ 03 - రాయ్‌పూర్
మూడో వన్డే: డిసెంబర్ 06 - విశాఖపట్నం
Latest News