|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 10:13 PM
తెలంగాణలో సైబర్ నేరాల తీవ్రత పెరుగుతున్న తీరుకు అద్దం పడుతూ.. విద్యాధికులు సైతం నకిలీ పెట్టుబడి పథకాలకు బలవుతున్న ఒక సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన ఓ వైద్యుడు నకిలీ షేర్ ట్రేడింగ్ పెట్టుబడుల పేరుతో ఏకంగా రూ. 14.61 కోట్లు పోగొట్టుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఒకే సైబర్ మోసంలో ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నమోదు చేసిన కేసు వివరాల ప్రకారం.. ఈ మోసం గత ఆగస్టు 27న ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా మొదలైంది.
'మోనికా మాధవన్' అనే పేరుతో పరిచయమైన మహిళ.. తన వ్యక్తిగత సమస్యలు, విడాకుల కేసు గురించి చెప్పి తొలుత వైద్యుడితో సానుభూతిని పెంచుకుంది. ఆ తర్వాత సంభాషణలను టెలిగ్రామ్ ఐడీకి మార్చి.. తనకు షేర్ ట్రేడింగ్‌లో ఐదేళ్లకు పైగా అనుభవముందని సీఎంసీ మార్కెట్లలో రోజూ లక్షల్లో సంపాదిస్తున్నానని నమ్మబలికింది. తనలా ట్రేడింగ్ చేసేందుకు రిజిస్టర్ చేసుకోవాలంటూ ఒక నకిలీ వెబ్‌సైట్ లింక్‌ను పంపించింది. సెప్టెంబర్ 30న తొలి పెట్టుబడి రూ. 30 లక్షలు పెట్టాలని ఒప్పించగా.. మొదటి ట్రేడ్‌లోనే వర్చువల్ ఖాతాలో రూ. 8.6 లక్షల లాభం కనిపించింది. అటుపై రూ. 85 వేలు ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వడంతో వైద్యుడికి పూర్తిగా నమ్మకం కుదిరింది. లాభాలు మరింత ఆశించిన వైద్యుడు, సదరు మహిళ ఒత్తిడికి తలొగ్గి బ్యాంకు రుణాలతోపాటు స్నేహితుల వద్ద అప్పులు చేసి సుమారు రూ. 14 కోట్ల మేర పెట్టుబడి పెట్టారు.
దీంతో అతడి వర్చువల్ ఖాతాలో రూ. 34 కోట్ల మేర నగదు నిల్వ ఉన్నట్లు చూపించింది. అయితే, ఈ మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించగా, పన్నుల కింద ఏకంగా రూ. 7.5 కోట్లు చెల్లించాలని నేరగాళ్లు డిమాండ్ చేశారు. వైద్యుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. మోనికా తన వాటాగా 50 శాతం పన్నును చెల్లిస్తానని.. మిగిలిన రూ. 3.75 కోట్లు చెల్లించాలని ఒత్తిడి చేసింది. ఆ సమయంలో సీఎంసీ ప్రతినిధులు పంపించిన డాక్యుమెంట్లు అసంబద్ధంగా అనిపించడంతో అనుమానం వచ్చిన వైద్యుడు గట్టిగా నిలదీయగా మోనికా స్పందించడం మానేసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు గురువారం ఫిర్యాదు చేయగా.. టీజీసీఎస్‌బీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ తరహా 'ట్రేడింగ్/పెట్టుబడి' మోసాల పట్ల విద్యాధికులు సైతం అత్యంత జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Latest News