|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 10:19 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సీఎస్ విజయానంద్ పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. నవంబర్ నెలాఖరున ఆయన రిటైర్ కావాల్సి ఉంది. అయితే విజయానంద్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో విజయానంద్ పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2026 ఫిబ్రవరి వరకూ విజయానంద్ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు. అనంతరం నూతన సీఎస్‌గా.. ఏపీ జలవనరుల శాఖ, సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జి.సాయిప్రసాద్ నియమితులు కానున్నారు.
మరోవైపు సాయిప్రసాద్ సర్వీస్ 2026 మే నెలాఖరు వరకూ ఉంది. అయితే ఆ తర్వాత కూడా కొన్ని రోజులు సర్వీసు పొడిగించి సాయిప్రసాద్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.అయితే ఒకే సమయంలో పాత సీఎస్ పదవీకాలం పొడిగింపు, కొత్త సీఎస్ నియామకం చేపట్టడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే పరిపాలనా బాధ్యతల బదిలీతో పాటుగా ముఖ్యమైన నిర్ణయాలు అమలు చేయడంలోనూ.. పాలనలో సమన్వయం కోసం ఈ విధానం చేపట్టినట్లు సమాచారం.
1991వ బ్యాచ్‌కు చెందిన సాయిప్రసాద్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శిగా, సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. ఫిబ్రవరి 28వ తేదీన విజయానంద్ సీఎస్ పదవి నుంచి తప్పుకున్న అనంతరం సాయిప్రసాద్ బాధ్యతలు చేపడతారు. అయితే ఆయన సర్వీస్ 2026 మేతో ముగియనుండగా.. ప్రభుత్వం మరికొన్ని రోజులు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ప్రస్తుత సీఎస్ విజయానంద్ నేపథ్యానికి వస్తే.. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. అలాగే ఏపీ ట్రాన్స్ కో , ఏపీ జెన్ కో సీఎండీగానూ సేవలు అందించారు. రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనర్జీ, ఐటీ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేశారు. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగానూ బాధ్యతలు నిర్వహించారు.2024 డిసెంబర్ 30 న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. తాజా పొడిగింపుతో 2026 ఫిబ్రవరి 28 వరకూ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
Latest News