|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 08:17 PM
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో అధికార మార్పిడి ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి శివకుమార్‌కు సీఎం బాధ్యతలు అప్పగిస్తారన్న వార్తల నేపథ్యంలో.. ఈ ఇద్దరు నేతల భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
కావెరీ రెసిడెన్స్‌లో సరదాగా సిద్ధూ, డీకే శివకుమార్..
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన నివాసమైన కావేరీ రెసిడెన్స్‌లో డీకే శివకుమార్‌తో అల్పాహారం తీసుకున్నట్లు 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేశారు. అదేవిధంగా డీకే శివ కుమార్ కూడా ఈ భేటీని ధృవీకరిస్తూ ఎక్స్ వేదికగా మరో పోస్టు పెట్టారు. అయితే ఈ పోస్టులో శివకుమార్.. "తాము కర్ణాటక ప్రభుత్వ ప్రాధాన్యతలు, ముందున్న సవాళ్ల గురించి చర్చించనున్నట్లు" పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం మార్పుపై జరుగుతున్న చర్చల కోణంలోనే ఈ భేటీ జరిగిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న సమయంలో ఇద్దరు నేతలు నవ్వుతూ కనిపించారు. ఇంతకాలం సీఎం సీటు కోసం గొడవ పడ్డ వీరిద్దరూ.. ఒక్కచోట కలిసి ఉండడం, కలిసి తినడం అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వీరి అల్పాహారంలో ఉప్మా, ఇడ్లీ, కేసరీ బాత్ ఉండగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన వారంతా చాలా చక్కగా అనిపిస్తోంది, మీరిద్దరూ ఇలాగే కలిసుంటే చూడాలని ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
'శివ-సిద్దు ఫార్ములా'పై ఉత్కంఠ
గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్ వైపు మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేటి బ్రేక్‌ఫాస్ట్ భేటీలో 'శివ-సిద్దు ఫార్ములా' (అధికార మార్పిడికి సంబంధించిన రాజీ ఫార్ములా) వెలువడుతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార మార్పిడి ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఇద్దరు నేతలు తమ ప్రస్తుత పదవుల్లోనే కొనసాగనున్నారు. అంతర్గత కలహాలకు తావివ్వకుండా, సజావుగా అధికారాన్ని బదిలీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఈ సమావేశం ద్వారా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
Latest News