|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 08:16 PM
పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సొంతిల్లు లేని పేదలకు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ హౌసింగ్ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా ఒకరోజు మాత్రమే గడువు ఉంది.ఇప్పటికే కొన్ని రోజులుగా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుండగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకు నాలుగు లక్షల మందికిపైగా దరఖాస్తులు సమర్పించినట్టు సమాచారం. రేపటితో గడువు ముగియనున్నందున చివరి రోజున భారీగా దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇల్లు లేని నిజమైన నిరుపేదలకు ప్రాధాన్యమిస్తూ, గతంలో ఏ హౌసింగ్ లబ్ధి పొందని వారికి ఈ అవకాశాన్ని అందించనున్నారు. పేదల సొంతింటి కలను త్వరగా నెరవేర్చేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది.
*ప్రత్యేక యాప్ ద్వారా గుర్తింపు : రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. పథకం అమలులో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ఆవాస్+ (Aawas Plus) అనే ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా అర్హుల గుర్తింపు, వివరాల సేకరణ, ఇంటి స్థలం ధృవీకరణ వంటి కార్యకలాపాలు పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతున్నాయి. గ్రామ/వార్డు సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, గృహనిర్మాణ శాఖ ఏఈలు ఇంటింటికి వెళ్లి అర్హులను గుర్తించే బాధ్యత చేపట్టారు. గడువు రేపటితో ముగియనున్నందున చివరి రోజున మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
– ఈ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థి ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి ఫోటో, అలాగే ఇల్లు నిర్మించబోయే స్థలపు ఫోటోలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. యాప్‌లో తీసే ముఖచిత్రం ఆధారంగా ఆధార్ సమాచారం ఆటోమేటిక్‌గా ప్రదర్శించబడుతుంది. అనంతరం జాబ్ కార్డు వివరాలు నమోదు చేస్తారు. మొత్తం ప్రక్రియ రియల్-టైమ్ ట్రాకింగ్‌లో ఉండడంతో దరఖాస్తుల నిజానిజాలు గుర్తించడం సులభమవుతుంది.
– గతంలో పీఎం ఆవాస్ యోజన పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అమలయ్యేది. ఇప్పుడు దీనిని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించారు.
– పేదల కోసం ఇల్లు మంజూరు ప్రక్రియలో రెండు విధానాలు అమలు చేయనున్నారు. సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించనున్నారు. స్థలం లేని వారికి గ్రామాల్లో మూడు సెంట్ల స్థలాన్ని కేటాయించి ఇళ్లను నిర్మించనున్నారు. రెండు వర్గాల కోసం వేర్వేరు జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
– కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎంపిక పద్ధతిలో అత్యంత పేదలను ముందుగా అర్హులుగా గుర్తించి ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికే ఈ ప్రత్యేక యాప్ రూపొందించబడింది.
– రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారా నమోదైన వివరాలను కేంద్రానికి పంపుతుంది. అనంతరం కేంద్రం మరోసారి పరిశీలించి తుది అర్హుల జాబితాను విడుదల చేస్తుంది.