|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 07:43 PM
ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాదికి సంబంధించిన సెలవుల జాబితాను పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం విడుదల చేసింది. బెంగాల్ సర్కారు విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ 2026లో ఆదివారాలు, రెండో శనివారం, ఆప్షనల్ హాలీడేస్‌తో కలిపితే మొత్తం సెలవులు 150 రోజులకుపైనే ఉన్నాయి. వివిధ పండగలు, స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, జాతీయ నాయకులు, మహాత్ముల పుట్టినరోజులు సహా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సెలవులు 47. ఇందులో నెలల వారీగా చూస్తే జనవరిలో ఐదు, ఫిబ్రవరిలో రెండు, మార్చిలో ఏడు, ఏప్రిల్‌లో మూడు, మేలో నాలుగు, జూన్, జులైలో ఒక్కొక్కటి, ఆగస్టులో మూడు, సెప్టెంబరులో రెండు, అక్టోబరులో 12, నవంబరులో ఆరు, డిసెంబరులో ఒకటి ఉన్నాయి.
అత్యధికంగా అక్టోబరులో 12 రోజులు సెలవులు ప్రకటించింది. ఆ నెలలో దసరా పండగ నేపథ్యంలో ఉద్యోగులకు భారీగా సెలవులు వచ్చాయి. పశ్చిమ్ బెంగాల్‌లో దసరా రాష్ట్ర పండగ కాగా.. ఈ వేడుకలు యునెస్కో గుర్తింపు సైతం పొందాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో బెంగాలీలు జరుపుకునే దసరా వేడుకలను చూసేందుకు భారత్‌లోని వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాల నుంచి కూడా వస్తారు. కేవలం ఉపాధ్యాయులకే కాకుండా మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు సైతం 10 రోజుల సెలవులు ఉంటాయి. ప్రభుత్వ సెలవుల్లో జనవరి 12న స్వామి వివేకానంద జయంతి, జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి, మే 9 విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఐచ్ఛిక సెలవులు ఉంటాయి.
వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో పశ్చిమ్ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దీదీ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా వారికి ఎక్కువ సెలవులు, వేతనాలు పెంపు వంటి నజరానాలు ప్రకటించింది. వరుసగా మూడుసార్లు బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్.. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‌లో కిందటిసారి మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ ఏకంగా 211 సీట్లలో గెలిచి రికార్డు సృష్టించింది. ఈసారి కూడా తమదే గెలుపు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు బెంగాల్ సీఎం మమత. అయితే, బీజేపీ నుంచి ఆమెకు గట్టిపోటీ ఎదురవుతోంది. ఇదే సమయంలో ఈసీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కూడా చేపట్టింది. దీనిని బెంగాల్ సీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Latest News