'ఇకపై మా మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలూ ఉండవు': డీకే శివకుమార్‌ను ఉద్దేశించి సిద్ధూ
 

by Suryaa Desk | Sat, Nov 29, 2025, 07:39 PM

కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించే ప్రయత్నంలో భాగంగా.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం ఉదయం కలిసి భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య.. తమ మధ్య గతంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఇకముందు కూడా ఉండబోవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు తాము ఈ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో పాల్గొన్నామని సిద్ధరామయ్య తెలిపారు. ఈ భేటీలో ఏ అంశం గురించి ప్రధానంగా చర్చించలేదని.. నెల రోజుల నుంచి అందరిలో ఉన్న గందరగోళానికి తెరదించేందుకే తాము కలిసి సమావేశమయ్యామని చెప్పారు.


బీజేపీ-జేడీఎస్ తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని సిద్ధరామయ్య దుయ్యబట్టారు. ప్రతిపక్షాల ఈ తప్పుడు ప్రచారాలను తాను, డీకే శివకుమార్‌ ఉమ్మడిగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ పార్టీ 2028 అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. 2028లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పని చేస్తామని ప్రకటించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం తాను సిద్ధరామయ్యతో కలిసి పని చేస్తానని హామీ ఇచ్చారు.


"మేము పార్టీకి విశ్వాసపాత్రులైన సైనికుల్లా పని చేస్తున్నాం. హైకమాండ్ ఏం చెప్పినా, దానిని అందరం అనుసరిస్తాం" అని డీకేఎస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీ పలు సమస్యలు ఎదుర్కొంటోందని.. రాబోయే 2028 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన నాయకత్వం విషయంలోనూ హైకమాండ్‌ నిర్ణయమే ఫైనల్‌ అని పేర్కొన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి మార్పు గురించి ప్రచారం జరుగుతోంది. రెండున్నరేళ్ల తర్వాత డీకే శివకుమార్‌కు సీఎం బాధ్యతలు అప్పగించేలా గతంలో ఓ ఒప్పందం కుదిరిందని ప్రచారం జరుగుతున్నా.. పార్టీ మాత్రం దీనిని పదే పదే ఖండిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ హైకమాండ్‌ సూచనల మేరకు నేటి భేటీ జరగడం, ఇద్దరు నేతలు ఐక్యతా సందేశాన్ని ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.

Latest News
IndiGo fiasco: DGCA eases some pilot duty rules amid havoc at airports Fri, Dec 05, 2025, 02:54 PM
Four hardcore militants held in Manipur; cases filed for threatening cultural groups Fri, Dec 05, 2025, 02:50 PM
Airfares skyrocket across India amid IndiGo's massive disruptions Fri, Dec 05, 2025, 02:49 PM
Pakistan: Five bodies of Baloch civilians were recovered across Balochistan amid wave of killings Fri, Dec 05, 2025, 02:41 PM
BJP MP Bansuri Swaraj immerses father Swaraj Kaushal's ashes in Ganga; condolence meet on Dec 7 Fri, Dec 05, 2025, 02:35 PM