|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 04:55 PM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆయన పర్యటన ఉంటుందని, 23వ భారత-రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారని భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. గత ఏడాది మాస్కోలో జరిగిన సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు.ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధనం, వాణిజ్య సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా, రష్యా నుంచి అందాల్సిన S-400 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థల డెలివరీలో జరుగుతున్న జాప్యంపై భారత్ దృష్టి సారించనుంది. ఇప్పటికే మూడు స్క్వాడ్రన్లు అందగా, మిగిలిన రెండు వచ్చే ఏడాది మధ్యలోగా అందాల్సి ఉంది. ఈ జాప్యంపై పుతిన్ పర్యటనలో స్పష్టత కోరతామని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. సుఖోయ్ విమానాల అప్‌గ్రేడేషన్‌తో పాటు ఇతర రక్షణ ప్రాజెక్టుల ఆలస్యంపైనా చర్చించనున్నారు. అంతేకాకుండా, రష్యా నుంచి రెండు స్క్వాడ్రన్ల సుఖోయ్ Su-57 ఫైటర్ జెట్ల కొనుగోలు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించడంతో, ముడి చమురుపై అదనపు డిస్కౌంట్లు ఇచ్చేందుకు రష్యా ముందుకొచ్చింది. ఈ అంశంపైనా చర్చలు జరగనున్నాయి.
Latest News