|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 04:54 PM
ఓ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై వారు కత్తులతో దాడికి పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోవూరులోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో జరిగింది.వివరాల్లోకి వెళితే.. నిన్న రాత్రి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్నారన్న సమాచారంతో ఈ రోజు పోలీసులు వారిని పట్టుకునేందుకు వెళ్లారు. పోలీసులను చూసిన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడమే కాకుండా, తమ వద్ద ఉన్న కత్తులతో వారిపై దాడికి తెగబడ్డారు.ఈ దాడిలో కానిస్టేబుల్ ఆదినారాయణ గాయపడ్డారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జేమ్స్ అనే నిందితుడి మోకాలికి బుల్లెట్ గాయమైంది. గాయపడిన కానిస్టేబుల్ ఆదినారాయణ, నిందితుడు జేమ్స్‌ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో కోవూరులో కలకలం రేగింది.
Latest News