పక్కా ప్రణాళికతో,,,,ఇరాన్‌ను ఏమార్చి దెబ్బ కొట్టిన అమెరికా!
 

by Suryaa Desk | Sun, Jun 22, 2025, 09:55 PM

అమెరికా జోక్యంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తార స్థాయికి చేరాయి. దీనికి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతోంది. ఈ మేరకు అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక అణు స్థావరాలను ఎలా ధ్వంసం చేసిందో వివరించింది అమెరికా. ఈ మేరకు వివరాలను అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్‌ హెగ్‌సేత్‌ వెల్లడించారు.


ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిపినట్లు అమెరికా రక్షణశాఖ తెలిపింది. దీనిని ‘ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌’గా పేర్కొన్న పెంటగాన్‌.. దీంతో ఇరాన్‌లోని అణు కార్యక్రమానికి తీవ్ర విఘాతం కలిగిందని చెప్పింది. ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేశామని పేర్కొంది. అమెరికా ఉమ్మడి దళాలు హై రిస్క్ ఆపరేషన్‌ను.. అసాధారణ నైపుణ్యాలు, క్రమశిక్షణతో పూర్తి చేశాయిని తెలిపింది. ఈ ఆపరేషన్‌కు పలు డొమైన్లు, థియేటర్లు కలిసి ప్రణాళిక రూపొందించాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపింది.


అయితే ఇరాన్‌లో ప్రభుత్వం మారాలని తాము కోరుకోవడం లేదని అన్నారు. అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టడం అమెరికా దాడుల ఉద్దేశం కాదని వెల్లడించారు. అమెరికా ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కమాండ్‌-ఇన్‌-చీఫ్‌ (అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్) నుంచి వచ్చిన ఆదేశాలను మాత్రమే తాము పాటించామని వెల్లడించారు. ఈ దాడులతో ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బతీశామని.. మొత్తంగా 14 బంకర్‌-బస్టర్‌ బాంబులను జారవిడిచినట్లు పేర్కొన్నారు. పలు యుద్ధవిమానాల సహాయంతో ఈ పని పూర్తి చేసినట్లు చెప్పారు.


దాడి చేశారిలా..


శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు, B-2 బాంబర్ల దాడి జరిగింది. ఈ బాంబర్లను అమెరికా నుండే పంపించారు. శత్రువులను ఆశ్చర్యపరచాలనేది దీని ఉద్దేశం అని పెంటగాన్ తెలిపింది. ఈ బాంబర్లలో కొన్నింటిని పసిఫిక్ మహాసముద్రం వైపు పంపించి శత్రువులను తప్పుదోవ పట్టించారు. ఈ విషయం కొద్దిమంది ప్లానర్లకు, వాషింగ్టన్‌లోని ముఖ్య నాయకులకు మాత్రమే తెలుసు. ప్రధాన దాడిలో ఏడు B-2 బాంబర్లను ఉపయోగించారు. ఒక్కో బాంబర్‌లో ఇద్దరు మాత్రమే సిబ్బంది ఉన్నారు. ఈ బాంబర్లు తక్కువ సమాచారంతో తూర్పు వైపు నిశ్శబ్దంగా వెళ్లాయి.


18 గంటల పాటు ప్రయాణించి, గాల్లోనే ఇంధనం నింపుకుని లక్ష్యాన్ని చేరుకున్నాయి. ఆకాశంలో ఉండగానే B-2 బాంబర్లు ఇతర విమానాలతో కలిసిపోయాయి. అయితే ఇది చాలా కష్టమైన పని అని, కచ్చితమైన సమయం పాటిస్తూ.. తక్కువ ఎయిర్ స్పేస్‌లోనే అన్ని విమానాలు లింక్ కావాలని పెంటగాన్ తెలిపింది. ఇలాంటి సమన్వయానికి అమెరికా దళాలు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందాయని పెంటగాన్ తెలిపింది.


సాయంత్రం 5 గంటలకు , దాడి చేసే విమానాలు ఇరాన్‌లోకి ప్రవేశించే ముందు.. సెంట్రల్ కమాండ్ ప్రాంతంలోని ఒక అమెరికా జలాంతర్గామి, ఇస్ఫహాన్‌లోని ముఖ్యమైన ప్రదేశాలపై రెండు డజన్లకు పైగా టోమాహాక్ ల్యాండ్ ఎటాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. దాడి చేసే విమానాలు ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు, అమెరికా అనేక మోసపూరిత వ్యూహాలను ఉపయోగించింది. 4వ, 5వ తరం విమానాలు ముందు పంపించి శత్రువులను తప్పుదోవ పట్టించింది. ఈ విమానాలు చాలా ఎత్తులో, వేగంగా వెళ్లాయి. ఆ తర్వాత దాడి చేసే విమానాలు ఫోర్డో, నటంజ్ ప్రాంతాలకు చేరుకున్నాయి. ఇరాన్ నుంచి ఎలాంటి దాడులు జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకున్నాయి. తమ విమానాలపై ఎటువంటి కాల్పులు జరగలేదని పెంటగాన్ తెలిపింది.


సాయంత్రం 6.40 గంటలకు (EST), మొదటి B-2 బాంబర్ ఫోర్డోలోని లక్ష్యాలపై రెండు GBU-57 (Guided Bomb Unit) బాంబులను వేసింది. మూడు ఇరాన్ మౌలిక సదుపాయాల లక్ష్యాలపై సాయంత్రం 6.40 నుంచి 7.05 గంటల (EST) మధ్య దాడులు జరిగాయి. టోమాహాక్ క్షిపణులు చివరిగా ఇస్ఫహాన్‌పై దాడి చేశాయి. ఇది ఇరాన్‌కు ఆశ్చర్యకరమైన దాడి అని పెంటగాన్ పేర్కొంది. దాడులు పూర్తయిన తర్వాత, మిడ్‌నైట్ హ్యమర్ స్ట్రైక్ ప్యాకేజీ ఇరాన్ గగనతలాన్ని విడిచిపెట్టి తిరిగి వెళ్లిపోయింది.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM