అమెరికాకు ఇజ్రాయెల్ మధ్య బలమైన స్నేహానికి కారణాలేంటి
 

by Suryaa Desk | Sun, Jun 22, 2025, 09:51 PM

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం రోజు రోజుకీ తీవ్రమవుతోంది. అణ్వస్త్ర దేశంగా అవతరించడానికి ఇరాన్‌కు ఇంకెంతో సమయం పట్టదనే పక్కా సమాచారంతో.. ఇజ్రాయెల్ ఆ దేశంపై దాడులకు దిగింది. ఇరాన్‌లోని కీలక సైనికాధికారులతోపాటు అణు శాస్త్రవేత్తలను టెల్‌అవీవ్ మట్టుబెట్టింది. ఈ దాడులకు ఇరాన్ కూడా తీవ్రంగానే స్పందించింది. ట్రంప్ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా.. ఇజ్రాయె‌ల్‌పై మిస్సైళ్లతో ప్రతిదాడులకు పాల్పడింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా.. మృత్యుదూతలుగా పిలిచే B2 బాంబర్లతో నేరుగా ఇరాన్‌‌లోని అణు స్థావరాలపై దాడులకు దిగింది. తద్వారా ఇరాన్‌-ఇజ్రాయెల్ యుద్ధంలో అగ్రరాజ్యం ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నట్లు అయ్యింది. ఇప్పటి వరకూ ఇజ్రాయెల్‌కు పరోక్షంగా సహకారం అందిస్తూ.. శాంతి ఒప్పందం చేసుకోవాలని ఇరాన్‌కు వార్నింగ్ ఇస్తూ వచ్చిన అమెరికా.. ఇప్పుడు ఏకంగా కదన రంగంలో కాలుమోపింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పట్ల అమెరికా ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తోంది..? కోటి జనాభా ఉన్న ఓ చిన్న దేశానికి అగ్రరాజ్యం ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తోందనే అనుమానం రాకమానదు. ఈ అనుమానాలను తీర్చే ప్రయత్నమే ఈ కథనం..


 ఇజ్రాయెల్ విస్తీర్ణం పరంగా, జనాభా పరంగా చాలా చిన్న దేశం. తెలంగాణలో నాలుగో వంతు కంటే తక్కువగా ఉండే ఈ దేశంలో దాదాపు కోటి మంది నివసిస్తున్నారు. ఉగ్రవాదుల దాడుల, యుద్ధాలతో నిత్యం రగులుతూ ఉండే పశ్చిమాసియాలోని వ్యూహాత్మక ప్రదేశంలో ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ మ్యాప్‌ను గమనిస్తే.. ఓవైపు మధ్యదరా సముద్రం, మిగతా అన్ని వైపులా అరబ్ దేశాలు కనిపిస్తాయి. ఆ మాటకొస్తే.. ఇజ్రాయెల్‌ దరిదాపుల్లో ఉన్నవన్నీ అరబిక్ దేశాలు లేదా ఇస్లామిక్ దేశాలే.


బ్రిటన్, అమెరికా, సోవియట్ రష్యాల మద్దతుతో యూదులకు ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఏర్పాటైంది. ఐక్యరాజ్య సమితి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 1948లో ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ఏర్పాటైంది. అయితే ఇజ్రాయెల్ ఏర్పాటు కావడం అరబ్ దేశాలకు మొదటి నుంచి ఇష్టం లేదని చెప్పొచ్చు. ఈ ప్రాంతం కోసం అరబ్బులైన పాలస్తీనియన్లు, యూదులైన ఇజ్రాయెలీల మధ్య ఆధిపత్య పోరే దీనికి కారణం. 1967లో తన పొరుగున ఉన్న అరబ్ దేశాలైన ఈజిప్ట్, జోర్డాన్, సిరియాలతో ఇజ్రాయెల్ ఏక కాలంలో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధంలో గెలిచిన ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలెం, గోలన్ హైట్స్ లాంటి ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకోగలిగింది. యుద్ధంలో అరబ్ దేశాలపై ఆధిపత్యం చెలాయించిన ఇజ్రాయెల్.. అప్పటి నుంచి అమెరికాకు చేరువైంది.


రెండో ప్రపంచం యుద్ధం తర్వాతి నుంచి అమెరికా, రష్యాలు ఈ ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతో మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) అని ఎక్కువగా వాడుకలో ఉన్న పశ్చిమాసియాపై పట్టు నిలుపుకోవడానికి అమెరికాకు ఇజ్రాయెల్ అవసరమైంది. దీంతో నాటోయేతర ప్రధాన మిత్రదేశంగా ఇజ్రాయెల్‌ను అమెరికా గుర్తించింది. ఫలితంగా ఇజ్రాయెల్‌కు అమెరికా నుంచి గణనీయంగా రక్షణ, ఆర్థిక, సాంకేతిక ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇజ్రాయెల్‌కు అమెరికా ఏటా అందించే సైనిక సాయం విలువ బిలియన్ డాలర్లలో ఉంటుంది.


ఇజ్రాయెల్ చాలా చిన్న దేశమే అయినప్పటికీ.. టెక్నాలజీ, నిఘా లాంటి విషయాల్లో ఆ దేశం చాలా ముందంజలో ఉంది. ఐరన్ డోమ్ సిస్టమ్ లాంటి క్షిపణి రక్షణ వ్యవస్థలు, మానవ రహిత డ్రోన్లు, నిఘా వ్యవస్థలు, టన్నెల్ డిటెక్షన్ టెక్నాలజీ లాంటి అత్యాధునిక ఆవిష్కరణలు ఇజ్రాయెల్ బలానికి నిదర్శనం. ఇజ్రాయెల్ డెవలప్ చేసిన డిఫెన్స్ టెక్నాలజీలను అమెరికా వాడుకుంది. మెక్సికో సరిహద్దుల్లో డ్రగ్స్ అక్రమ రవాణాకు కీలకంగా మారిన సొరంగాలను ఇజ్రాయెల్ టన్నెల్ డిటెక్షన్ టెక్నాలజీ సాయంతోనే అమెరికా గుర్తించగలిగింది.


సైబర్ సెక్యూరిటీలో, సైబర్ వార్‌ఫేర్‌లోనూ ఇజ్రాయెల్‌ ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలిచిందని చెప్పొచ్చు. సైబర్ దాడుల నుంచి తన దేశంలోని నగరాలు, విమానాశ్రయాల్లోని కీలక మౌలిక సదుపాయాలను ఇజ్రాయెల్ కాపాడుకుంటోంది. యారో సిస్టమ్, డేవిడ్స్ స్లింగ్ లాంటి అనేక డిఫెన్స్ టెక్నాలజీ ప్రాజెక్టుల కోసం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పని చేశాయి.


ఇరాన్‌పై దాడి చేసిన అమెరికన్ స్టెల్త్ బాంబర్లు


మొసాద్.. ఎంత చెప్పినా తక్కువే..


ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోని అత్యుత్తమ నిఘా సంస్థల్లో ఇదొకటి. ఇజ్రాయెల్‌ విజయాల్లో దీనిది కీలక పాత్ర. మొసాద్ ఎవరినైనా టార్గెట్ చేసిందంటే.. ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా సరే వెతికి మరి చంపేస్తుందని చెబుతుంటారు. ఆ మధ్య హిజ్బూల్లా ఉగ్రవాదుల పేజర్ పేలుళ్ల నుంచి ఇప్పటి ఇరాన్‌ దాడుల వరకూ ఇజ్రాయెల్ చేపట్టిన ప్రతి ఆపరేషన్‌లోనూ మొసాద్‌ది కీలక పాత్ర. పశ్చిమాసియాలో చిన్న కదలికలు సైతం ఇజ్రాయెల్‌కు తెలుస్తాయంటే అతిశయోక్తి కాదు. శత్రువుల కదలికలపై నిఘా పెట్టడంలో, ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను ఛేదించడంలో మొసాద్‌కు ఎంతో అనుభవం ఉంది. రష్యాతో కోల్డ్ వార్ సమయం నుంచే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం అమెరికాకు ఎంతో ఉపయోగపడుతోంది.


ఐసిస్, అల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలతో పోరాటానికి అవసరమైన నిఘా సమాచారం, సైనిక సహకారాన్ని ఇజ్రాయెల్ అమెరికాకు అందిస్తోంది. చమురు రవాణాకు, అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకంగా మారిన సుయాజ్ కాలువకు ఇజ్రాయెల్ చేరువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో నౌకల రాకపోకలు సజావుగా సాగడం అమెరికాకు ఎంతో అవసరం. దీనికి ఇజ్రాయెల్ ఉపయోగపడుతోంది.


ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న ఇజ్రాయెల్, ఇరాన్ అసలు సరిహద్దు దేశాలే కాదు. ఒకప్పుడు ఈ రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలే ఉండేవి. కానీ క్రమంగా దూరం పెరిగి శత్రువులుగా మారాయి. పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యం చెలాయించడం ఇరాన్‌కు ఇష్టం లేదు. ఇరాన్ క్షిపణి పరీక్షలు చేపడుతుండటం, అణ్వాస్త్రాలను సమకూర్చుకునే దిశగా ముందుకు సాగుతుండటం అమెరికాకు ఏమాత్రం నచ్చని వ్యవహారం. దీంతో పశ్చిమాసియాలో ఇరాన్‌‌ దూకుడును అడ్డుకోవడానికి అమెరికా ఇజ్రాయెల్‌ను ఉపయోగించుకుంటోంది. ఇరాన్ అణ్వస్త్ర దేశంగా మారితే తన మనుగడకే ముప్పుగా మారుతుందన్న భయం ఇజ్రాయెల్‌కు ఉంది.


అమెరికాలోని యూదులు..


వీటన్నింటి తోపాటు అమెరికా, ఇజ్రాయెల్ మధ్య మైత్రి ఇంతగా బలపడటానికి ప్రధాన కారణం అమెరికాలోని యూదులు. ప్రపంచంలో యూదుల జనాభా ఎక్కువగా ఉన్న మొదటి దేశం ఇజ్రాయెల్ అయితే, రెండో దేశం అమెరికా. అగ్రరాజ్యంలో ఇజ్రాయెల్‌తో సమానంగా 70-80 లక్షల మంది యూదులు ఉంటారని అంచనా. అమెరికా జనాభాలో యూదుల శాతం తక్కువే. కానీ ఆ దేశ రాజకీయాల్లో యూదులు ఉన్నత పదవుల్లో ఉన్నారు. యూదులు చాలా మంది సెనేటర్లుగా, మంత్రులుగా, జడ్జిలుగా ఉన్నారు. యూదులు ఆర్థికంగానూ బలవంతులు. బ్యాంకింగ్, ఫైనాన్స్, మీడియా, టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్, మెడిసిన్, ఎడ్యుకేషన్, లా తదితర రంగాల్లో యూదులు అమెరికాలో కీలక స్థానాల్లో ఉన్నారు. దీంతో అమెరికాలో యూదుల లాబీయింగ్ చాలా బలంగా ఉంటుంది. ఇజ్రాయెల్ పట్ల అమెరికా విధానాల రూపకల్పనలో ఈ లాబీయింగ్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికాలోని క్రిస్టియన్లలోనూ ఇజ్రాయెల్‌కు గణనీయమైన మద్దతు ఉంది.


ఓవరల్‌గా చూస్తే.. పశ్చిమాసియాలో అరబ్ దేశాల మధ్యనున్న ఏకైక ముస్లిమేతర దేశమైన ఇజ్రాయెల్ తన మనుగడ కోసం అమెరికాతో దోస్తీ చేస్తుంటే.. అగ్రరాజ్యం ఈ ప్రాంతంపై తన పట్టును నిలుపుకోవడం కోసం ఇజ్రాయెల్‌తో స్నేహం చేస్తోంది. అందుకే గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఘాటుగా స్పందించలేదనే అపవాదును అమెరికా మూటగట్టుకుంది. ఇజ్రాయెల్‌కు కుదిరితే ప్రత్యక్షంగానో కుదరకపోతే పరోక్షంగానో.. ఏదో ఒకలా అమెరికా మద్దతు ఉండటం అనేది మాత్రం సహజం.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM