|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 05:43 PM
మరికొద్ది రోజుల్లోనే బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా.. ప్రధాని మోదీ మరోసారి ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిలపై విరుచుకు పడ్డారు. రాష్ట్రం పేదరికంలో ఉండడానికి కారణం "లైసెన్స్ రాజ్" అన్నారు. నేతల కుటుంబీకులు ధనవంతులు కాగా.. ప్రజలు మాత్రం పేదలుగా మిగిలిపోయారని చెప్పారు. రానున్న రోజుల్లో మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రజాసేవ చేయకుంటే తాను ప్రశాంతంగా నిద్ర కూడా పోలేనని.. రాత్రి, పగలు ప్రజల కోసమే పని చేస్తానని వ్యాఖ్యానించారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్‌లోని సివాన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన భారీ బహిరంగ సభ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సభలో మోదీ.. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ), కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు గతంలో బిహార్‌ను పేదరికం, శాంతి భద్రతల లోపంతో కూడిన 'జంగిల్ రాజ్' (అరాచక పాలన)లోకి నెట్టాయని తీవ్రంగా ధ్వజమెత్తారు. అలాగే ఆర్‌జేడీ, కాంగ్రెస్ పాలనలో బిహార్ వెనుకబడిపోయిందని, ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొన్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల జీవితాలను మెరుగు పరచడంలో ఈ పార్టీలు పూర్తిగా విఫలం అయ్యాయని చెప్పారు. అరాచక పాలనను తిరిగి తీసుకురావడానికి ఆర్‌జేడీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని హెచ్చరిస్తూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అదే సమయంలో తమ ఎన్డీఏ ప్రభుత్వం బిహార్ అభివృద్ధికి అంకిత భావంతో పని చేసిందని మోదీ నొక్కి చెప్పారు. రాష్ట్రంలో జరిగిన మౌలిక సదుపాయాల కల్పనను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. "మా ప్రభుత్వం బిహార్‌లో 55,000 కిలో మీటర్ల గ్రామీణ రహదారులను నిర్మించింది. దీనివల్ల గ్రామీణ ప్రాంత ప్రజల రవాణా కష్టాలు తీరాయి. అంతేకాకుండా, 1.5 కోట్లకు పైగా గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించి, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాం" అని మోదీ వివరించారు. భారత్ సాధిస్తున్న ప్రగతిని కూడా ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. తాను విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రపంచ నాయకులందరూ భారతదేశం సాధిస్తున్న పురోగతిని, అభివృద్ధిని ప్రశంసిస్తున్నారని ఆయన అన్నారు.
గతంలో భారత్ పట్ల ప్రపంచ దేశాలు చూపిన చిన్నచూపు ఇప్పుడు లేదని, దేశం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోందని మోడీ స్పష్టం చేశారు. ఈ ప్రచారం ద్వారా ప్రధాని మోడీ, బిహార్‌లో బీజేపీ-ఎన్డీఏ కూటమికి మద్దతును కూడగట్టాలని ప్రయత్నించారు. గత పాలనలోని లోపాలను ఎత్తి చూపుతూనే, తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సివాన్ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరవడంతో, మోడీ ప్రచారం విజయవంతమైందని బీజేపీ వర్గాలు ప్రకటించాయి.