|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 07:01 PM
ఢిల్లీలో ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్(టీబీఐ) వ్యవస్థాపకులు టోనీ బ్లేయిర్‌తో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్ వినియోగంపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఒప్పందం కుదిరింది. అలాగే ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్ష నిర్వహించారు. ఈరోజు (గురువారం) న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో టోనీ బ్లెయిర్‌ను మంత్రి లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. గత ఏడాది జులై నెలలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ను మంత్రి లోకేష్ ముంబైలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఏఐ టూల్స్‌ను ఉపయోగించడానికి టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్(టీబీఐ) ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయిర్ అంగీకరించారు. ఆ మేరకు విద్యారంగంలో అధునాతన సాంకేతికతను అమలు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి ఏపీ విద్యాశాఖ, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (టీబీఐ) మధ్య 2024 డిసెంబర్‌లో ఒప్పందం కుదిరింది.
Latest News