ఎయిరిండియా విమాన ప్రమాదం కేసులో కీలక పరిణామం... ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఫోన్లు స్వాధీనం
 

by Suryaa Desk | Wed, Jun 18, 2025, 06:37 PM

జూన్ 12న గురువారం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం (SVPI) వద్ద జరిగిన ఎయిరిండియా AI 171 నంబరు విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ దుర్ఘటనలో విమానంలోని 241 మంది సహా 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్‌ సమీపంలోని గాట్‌విక్‌కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. దీంతో ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విమాన ప్రమాద విచారణ బ్యూరో (AAIB) ఆధ్వర్యంలో కేంద్ర స్థాయి దర్యాప్తు జరుగుతోంది. ఈ విచారణకు గుజరాత్ పోలీసు శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (AAI), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) మద్దతు అందిస్తున్నాయి. ఈ విమాన ప్రమాదానికి టర్కీ సంస్థ నిర్వహణ వైఫల్యమే కారణమని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.


అటు, అమెరికా జాతీయ రవాణా భద్రతా మండలి (NTSB) స్వతంత్రంగా దర్యాప్తు ప్రారంభించింది. బోయింగ్ కంపెనీ అమెరికాలో నమోదు కావడంతో అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఒప్పందాల ప్రకారం NTSB దర్యాప్తు జరుపుతోంది. ప్రపంచంలో మొట్టమొదటి బోయింగ్ 787 విమాన ప్రమాదం ఇదే కావడం గమనార్హం. ప్రమాద స్థలిలో డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (DFDR), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) రెండూ లభ్యమయ్యాయి. ఇవి విమానం ఎలా కూలిందో పక్కాగా నిర్ధారించేందుకు కీలకంగా మారాయి. విమాన వేగం, ఎత్తు, ఇంజిన్ శక్తి, ఫ్లాప్ పొజిషన్లు, ల్యాండింగ్ గేర్ మొదలైనవి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్.. పైలట్ సంభాషణలు, అలారమ్‌లు, ఇంజిన్ శబ్దాలు మొదలైనవన్నీ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికార్డ్ చేస్తుంది.


కుట్రకోణం


విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం జరగడంతో ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందా? అని అనుమానిస్తున్నారు. దీంతో విమానాశ్రయం పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌ను సేకరించిన విచారణ బృందాలు, ఎలాంటి ఉగ్రవాద చర్య లేదా లోపభూయిష్టమైన గ్రౌండ్ క్లియరెన్స్‌ వంటి కారణాలను పరిశీలిస్తున్నాయి. టేకాఫ్‌కు అనుమతినిచ్చిన సిబ్బంది ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని, వాటిలోని సమాచారం పరిశీలిస్తున్నారు. వారిపై కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.


విచారణలో బోయింగ్ ప్రతినిధులు, అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ, యూకే విమానయాన నిపుణులు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. కాగా, ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్రం నియమించిన కమిటీ మూడు నెలల్లో నివేదిక సమర్పిస్తుందని కేంద్ర మంత్రి మురళీధర్ మోహుల్ మంగళవారం ప్రకటించారు. విమాన ప్రమాదంలో మృతిచెందినవారి డీఎన్ఏ నమూనాలతో గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకూ 150 మందిని గుర్తించారు. విమానంలో 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు.

Latest News
GCC leaders reject Iran's measures to close Strait of Hormuz Wed, Apr 29, 2026, 12:46 PM
Congress accuses Rajnath Singh of giving 'shameful clean chit' to Pak for saying terror has 'no nationality' at SCO Wed, Apr 29, 2026, 12:36 PM
UK PM Starmer not to face investigation over Mandelson issue Wed, Apr 29, 2026, 12:16 PM
Delhi excise policy case: Another AAP leader refuses to participate in court proceedings Wed, Apr 29, 2026, 12:14 PM
'Trinamool miscreants hit me on head with rod': BJP polling agent in Bengal's Nadia Wed, Apr 29, 2026, 12:10 PM