|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 06:43 PM
ఏపీలో ఇప్పుడు ఏం నడుస్తోంది అంటే.. తల్లికి వందనం నడుస్తోందనే చెప్పొచ్చు. ఎన్డీఏ కూటమి పాలనకు ఏడాది పూర్తి కావటంతో జూన్ 12న సీఎం నారా చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేశారు. సుమారుగా 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం నిధులు విడుదల చేశారు. జూన్ 13వ తేదీ నుంచి విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలలో తల్లికి వందనం నగదు జమ అవుతోంది. ఏడాదికి రూ.15000 అని చెప్పినప్పటికీ.. పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.2000 కట్ చేస్తోంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే వారు ఉంటే అందరికీ రూ.13000 చొప్పున జమ చేసింది. దీంతో తల్లికి వందనం పథకం లబ్ధి పొందిన కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. స్కూళ్లు తెరిచే సమయంలో తల్లికి వందనం నిధులు జమ చేయటంతో హర్షం వ్యక్తం చేశాయి.
అయితే అర్హులైనప్పటికీ తల్లికి వందనం పథకం డబ్బులు రాని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తోంది. తల్లికి వందనం డబ్బులు రాకపోతే జూన్ 20లోగా తమ సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత అధికారులు అర్హతలను పరిశీలించి.. జులై 5న తల్లికి వందనం డబ్బులు జమ చేస్తారు. ఈ నేపథ్యంలో తల్లికి వందనం డబ్బులు పడినవారు.. బ్యాంకులకు, పడని వారు సచివాలయాలకు పరుగులు తీస్తు్న్నారు. ఈ క్రమంలోనే ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
తల్లికి వందనం పథకం కోసం కరెంట్ వినియోగాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు. నెలకు 300 యూనిట్ల కంటే అధికంగా కరెంట్ వినియోగించే కుటుంబాలకు తల్లికి వందనం పథకం వర్తించదు. దీంతో తల్లికి వందనం దరఖాస్తులలో ఇలాంటివి ఏవైనా ఉంటే వారిని అనర్హులుగా పరిగణిస్తారు. అయితే క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది నిర్వాకంతో.. అర్హులైనవారు కూడా తల్లికి వందనం పథకానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ కార్డు అనుసంధానం చేస్తుంటారు. అయితే విద్యుత్ సిబ్బంది పొరపాటుగా నమోదు చేయటంతో.. ఒకే ఆధార్ కార్డు మీద రెండు కంటే ఎక్కువ విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు చూపుతోంది. ఇలాంటి ఘటనే విశాఖపట్నంలో వెలుగుచూసింది.
విశాఖపట్నంలోని గోపాలపట్నంలో సొంత ఇల్లు లేని కుటుంబానికి 10 కరెంట్ మీటర్లు ఉన్నట్లు చూపిస్తోందని ఆ కుటుంబం వాపోతోంది. తన పేరు మీద రెండు విద్యుత్ కనెక్షన్లు, తన భార్య పేరు మీద 8 కనెక్షన్లు ఉన్నాయని.. తమకు అసలు ఇళ్లే లేదని ఓ వ్యక్తి వాపోయాడు. విద్యుత్ సిబ్బంది నిర్వాకం కారణంగా తల్లికి వందనం లబ్ధి అందడం లేదంటున్నారు. అలాగే ఒక ఆధార్ కార్డు మీద 3, 4, 8 విద్యుత్ కనెక్షన్లు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ కారణంతోనే మీకు తల్లికి వందనం రాలేదని సచివాలయ సిబ్బంది చెప్పటంతో బాధితులు షాక్ తిన్నారు. విద్యుత్ శాఖ కార్యాలయానికి క్యూ కట్టారు. అయితే వారు రేపూమాపూ అని చెప్తున్నారని.. ఈ సంవత్సరం తమకు తల్లికి వందనం లేనట్టేనని వాపోతున్నారు.
Latest News