|
|
by Suryaa Desk | Thu, Jun 12, 2025, 06:42 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 67 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.. తల్లికి వందనం పథకం కోసం రూ.10,091 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ నిధుల్లో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తుంది అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న అమ్మఒడికి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తున్నామన్నారు. గతంలో అమ్మఒడి పథకం ఒకరికి మాత్రమే ఇస్తే.. ఇప్పుడు తమ ప్రభుత్వం మాత్రం ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం పథకం ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో 42,61,965 మందికి ఇస్తే.. కూటమి ప్రభుత్వం 67,27,164 మందికి వర్తింపజేస్తోందన్నారు.
తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలను గ్రామ,వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు చంద్రబాబు. ఒకవేళ అర్హత ఉండి లిస్ట్‌లో పేరు రాకపోయినా మరో అవకాశం కల్పిస్తామన్నారు. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సరిదిద్ది సహాయం అందిస్తామన్నారు. ఈ నెల (జూన్) 26 వరకు ఫిర్యాదులు స్వీకరించి.. ఈ నెల 30న తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. ఒకవేళ విద్యార్థికి తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్నారు. అదే అనాథలైతే జిల్లా కలెక్టర్ నిర్ధారించిన ప్రకారం వారి బ్యాంక్ అకౌంట్‌లలో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తారన్నారు.
తల్లికి వందనం పథకానికి సబంధించిన జీవో కాపీలను ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు అందజేశారు. ఎన్డీఏ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివి అన్నారు. ఓవైపు సంపదను సృష్టిస్తామని, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఈ నెల 20న అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు ఇస్తామని.. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కంటే అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.6 వేలు ఎక్కువ ఇస్తున్నామన్నారు. తాము ఈ ఏడాదిలో మంచి పాలన అందించి వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.