|
|
by Suryaa Desk | Thu, Jun 12, 2025, 06:38 PM
ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్. ఏపీ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కేంద్రం.. కందిపప్పు సేకరణ గడువును పొడిగించింది. కందిపప్పు సేకరణ గడువును కేంద్రం మరో 15 రోజులు పొడిగించింది. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా వెల్లడించారు. కందుల సేకరణ గడువు పెంచాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థనను పరిశీలించి ఖరీఫ్ 2024–25 కాలానికి కందిపప్పు సేకరణ గడువును కేంద్రం మరో 15 రోజులు పొడిగించిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి కందిపప్పును మద్దతు ధరపై జూన్ 26 వరకూ కేంద్రం సేకరించనుంది.
అలాగే కందిపప్పు సేకరణ పరిమితి 95,620 మెట్రిక్ టన్నులుగా నిర్ణయించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వినతిపై త్వరితగతిన సహకరించి.. రైతులకు ఎంతో ఉపయోగపడేలాగా చర్యలు తీసుకున్నందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో కంది పంటను విస్తృతంగా సాగుచేస్తారు. రాష్ట్రంలో పొడి భూములు, తక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో కందిపంట ఎక్కువగా సాగుచేస్తుంటారు. కర్నూలు, అనంతపురం, కడప, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో కందిపంట సాగు ఎక్కువగా జరుగుతుంది. ఈ ప్రాంతాల్లోని ఎర్ర భూములు, నల్ల రేగడి భూములు, తేలికపాటి ఇసుక నేలలు కంది సాగుకు అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా కంది రబీ సీజన్‌లో తక్కువగా సాగు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్-నవంబర్‌లో విత్తుతారు. ఎక్కువగా ఖరీఫ్ సీజన్‌లోనే కందిపంట సాగు చేస్తుంటారు.
అయితే ఖరీఫ్ సీజన్‌లో కందిపంట సాగు చేసిన రైతులు మద్దతు ధర లేకపోవటంతో నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు అండగా ఉండేందుకు కనీస మద్దతు ధర పథకం కింద కేంద్రప్రభుత్వం కందిపప్పును సేకరిస్తోంది. తాజాగా ఈ గడువు పొడిగించడంతో మరింత మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
Latest News