|
|
by Suryaa Desk | Wed, Jun 11, 2025, 06:42 PM
భారతదేశం.. వ్యవసాయ ఆధారిత దేశం. మనదేశంలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో సేద్యమే జీవనాధారంగా బతుకు సాగించే రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు, పథకాలు చేపడుతోంది. అయితే వాటి లబ్ధి చివరి లబ్ధిదారుడి వరకూ వెళ్తోందా అంటే అనుమానమే. నిరక్ష్యరాస్యతో లేదా ప్రచార లేమో తెలియదు కానీ ప్రభుత్వ కార్యక్రమాల గురించి గ్రామీణ ప్రాంతాల్లోని రైతన్నలలో ఎక్కువ మంది అవగాహన ఉండటం లేదు. ఫలితంగా ప్రభుత్వం ఏదైతే ఉద్దేశంతో ఆ కార్యక్రమం ప్రారంభించిందో ఆ లక్ష్యం నెరవేరటం లేదు. అలాంటివే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలోని (సొసైటీలు) కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్‌సీ).
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (సొసైటీలు) గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు వ్యవసాయ రుణాలను, ఆర్థిక సేవలను అందించేందుకు ఏర్పాటు చేశారు. ఈ సంఘాలు రైతులకు పంట రుణాలతో పాటుగా పంటల మార్కెటింగ్, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీలో సహాయపడుతుంటాయి. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో కామన్ సర్వీస్ సెంటర్‌లను కూడా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ విధానం అమల్లో ఉంది. ఈ సీఎస్‌సీ సెంటర్ల ద్వారా అనేక సేవలు పొందవచ్చు. కరెంట్ బిల్లులు, బస్సు, రైలు టికెట్ల రిజర్వేషన్లు, మొబైల్ ఫోన్, డీటీహెచ్ రీఛార్జులు చేసుకోవచ్చు. ఈ సేవలకు కొన్నిచోట్ల నామమాత్రం రుసుం వసూలు చేస్తుండగా.. కొన్నిచోట్ల ఉచితంగా అందిస్తుండటం విశేషం. అయితే వీటిపై అవగాహన లేక రైతులు ఈ సేవలను ఉపయోగించుకోవటం లేదని అధికారులు చెప్తున్నారు.
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలోని కామన్ సర్వీస్ సెంటర్లలో పాన్‌కార్డు సేవలు, ఇన్సూరెన్స్ రెన్యువల్, రైలు టికెట్ల బుకింగ్, విమానం, బస్సు టికెట్ల రిజర్వేషన్, రీఛార్జులు, కరెంట్ బిల్లుల చెల్లింపు వంటి సేవలు అందిస్తున్నారు. మొత్తంగా ఇలా 23 రకాల సేవలు అందిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. సీఎస్‌సీ సేవలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని.. ప్రస్తుతానికి ఉచితంగానే సేవలు అందిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల రైతులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల అధికారులు చెప్తున్నారు. ఈ సేవలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
Latest News