|
|
by Suryaa Desk | Wed, Jun 11, 2025, 06:45 PM
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన గొప్ప మనసు, ఉదారతను చాటుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్.. భారీగా విరాళాలు అందజేశారు. దీనికి సంబంధించిన ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో ఉన్న కొణిదెల గ్రామానికి పవన్‌కల్యాణ్ రూ.50 లక్షలు విరాళంగా అందజేశారు. కర్నూలు జిల్లాలోని పూడిచర్ల గ్రామంలో ఇటీవల పంటకుంట నిర్మాణాల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య.. కొణిదెల గ్రామాన్ని అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్‌ను కోరారు. దీంతో తన ఇంటి పేరుతో ఉన్న ఈ గ్రామాన్ని సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.50 లక్షలు విరాళంగా అందజేశారు.
మరోవైపు తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకు ఇటీవల రూ.50 లక్షలు విరాళంగా అందజేశారు పవన్ కళ్యాణ్. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వరదలు సంభవించిన సమయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాలకూ రూ.6 కోట్లు విరాళంగా అందజేశారు. జనసేన క్రియాశీలక కార్యకర్తల ప్రమాద బీమా కోసం కోటి రూపాయలు తన సొంత నిధులను పవన్ కళ్యాణ్ కేటాయించారు.
అలాగే పిఠాపురంలోని ఎలక్ట్రీషియన్లకు పవన్ కళ్యాణ్ ఇటీవల సేఫ్టీ కిట్లు అందజేశారు. రూ.16 లక్షలు సొంత డబ్బు ఖర్చు చేసి 325 మంది ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్లు అందించారు. సురేష్ బాబు అనే ఎలక్ట్రీషియన్ కరెంట్ షాక్ కొట్టి చనిపోవటంతో.. మరోసారి ఇలాంటి ఘటన జరగకూడదనే ఉద్దేశంతో పిఠాపురం నియోజకవర్గంలోని 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు పవన్ కళ్యాణ్ సేఫ్టీ కిట్లు అందించారు.
అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.17 లక్షలు విరాళంగా అందించారు జనసేనాని. పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన మధుసూదన్ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారంగా అందజేశారు. అలాగే ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి తన వంతు సాయంగా రూ.25 లక్షలు పరిహారం ప్రకటించారు.
డయేరియా బాధితుల కోసం 11 లక్షలు, కలుషిత నీటి కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఉపయోగపడేలా రూ.10 లక్షలు.. మైదానాల కోసం రూ.60 లక్షలు విరాళంగా అందించిన పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు నిర్మాతపై భారం తగ్గించేందుకు తీసుకున్న అడ్వాన్స్ నుంచి రూ.11 కోట్లు వెనక్కి చెల్లించారని జనసేన శ్రేణులు ట్వీట్ వైరల్ చేస్తున్నాయి. మొత్తంగా ఒక్క ఏడాదిలోనే పవన్ కళ్యాణ్ 20 కోట్ల వరకూ విరాళంగా ఇచ్చి.. తన పెద్ద మనసు చాటుకున్నారని జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
Latest News