|
|
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 07:52 PM
భారత్, బంగ్లాదేశ్ దశాబ్దాలుగా మిత్ర దేశాలుగా కొనసాగాయి. అయితే ఇది ఏడాది క్రితం వరకే. ఎప్పుడైతే బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగి.. షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవి వదిలేసి.. పారిపోయి భారత్‌లోకి వచ్చి తలదాచుకుందో అప్పటివరకు పరిస్థితి అలాగే ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లోని పలు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా మహమ్మద్ యూనస్‌ను ఎంపిక చేశారు. అప్పటి నుంచి భారత్ పట్ల శత్రుభావం పెంచుకున్న మహమ్మద్ యూనస్.. పాక్, చైనాల పంచన చేరారు.
దీంతో రోజురోజుకూ భారత్‌కు దూరంగా బంగ్లాదేశ్ విధానాలు, నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల వేళ.. తాజాగా మహమ్మద్ యూనస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈద్-ఉల్-అజా సందర్భంగా బంగ్లాదేశ్ ప్రజలకు, ఆ దేశ తాత్కాలిక ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సందేశం పంపించగా.. దానికి బదులుగా ఆయన ఈ లేఖను రాశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ రెండు లేఖలను తాజాగా ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
అయితే ప్రధాని మోదీకి రాసిన లేఖలో.. తమ ప్రజల సంక్షేమం కోసం పరస్పర గౌరవం, అవగాహనతో కలిసి పనిచేయడం కోసం తాము కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రధాని మోదీ సందేశం రెండు దేశాల మధ్య ఉన్న విలువలను ప్రతిబింబిస్తుందని మహమ్మద్ యూనస్ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, భారతదేశ ప్రజలకు యూనస్ శుభాకాంక్షలు తెలిపారు. పరస్పర గౌరవం, అవగాహన స్ఫూర్తి భారత్, బంగ్లాదేశ్‌ల ప్రజల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి మార్గనిర్దేశం చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ఆ లేఖలో యూనస్ పేర్కొన్నారు.
ఈద్-ఉల్-అజా పండగ.. త్యాగం, ఔదార్యం, ఐక్యత స్ఫూర్తితో అందర్నీ ఏకం చేస్తుందని యూనస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పనిచేయడానికి అందరినీ ప్రేరేపిస్తుందని వెల్లడించారు. ఇటీవల ఈద్-ఉల్-అజా సందర్భంగా నరేంద్ర మోదీ రాసిన లేఖలో.. ఈ పండగ భారతదేశ గొప్ప, విభిన్న సాంస్కృతిక వారసత్వంలో ఒక అంతర్భాగమని అభివర్ణించారు. ఈ పండుగ త్యాగం, కరుణ, సోదరభావం వంటి విలువలను గుర్తు చేస్తుందని తెలిపారు. ఇది శాంతియుత, సమ్మిళిత ప్రపంచాన్ని నిర్మించడానికి అవసరమని తెలిపారు. ఇస్లామిక్ ప్రధాన పండుగల్లో ఈద్-ఉల్-అదా ఒకటి కావడం విశేషం.