|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 09:22 PM
"రూ.500 నోట్లు 2026 నాటికి రద్దు కాబోతున్నాయా?" ఈ ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా మందిని గందరగోళానికి గురిచేస్తోంది. యూట్యూబ్‌లో విస్తృతంగా షేర్ అవుతున్న ఒక వీడియో ఈ పుకార్లకు కారణం. క్యాపిటల్ టీవీ (capitaltvind) అనే యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసిన ఒక వీడియో, 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2026 మార్చి నాటికి రూ. 500 నోట్లను ఉపసంహరించుకోవాలని యోచిస్తోందని' పేర్కొంది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో, రూ. 500 నోటు నిజంగా రద్దు అవుతుందా లేదా అనే చర్చ మొదలైంది. సదరు వీడియోలో, ఆర్బీఐ రూ. 500 కరెన్సీ నోట్లను దశలవారీగా ఉపసంహరించుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఈ ప్రక్రియ 2026 మార్చి నాటికి పూర్తవుతుందని క్లెయిమ్ చేసింది.
వాస్తవం ఏంటి?
పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదు. ఆర్బీఐ రూ. 500 కరెన్సీ నోట్లను రద్దు చేయడానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నోట్లు చట్టబద్ధమైన చెల్లుబాటును కలిగి ఉన్నాయి. ఇంకా దేశవ్యాప్తంగా ఇప్పటికీ జారీ చేస్తోంది. లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ వీడియో తప్పుదోవ పట్టించేది ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆర్బీఐ కూడా సర్క్యులర్ ఏం విడుదల చేయలేదు.
గతంలో, నవంబర్ 2016లో అప్పటి పెద్ద నోట్లు.. రూ. 500, రూ. 1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత, 2023 మే నెలలో, RBI రూ. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది, అయితే అవి చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతాయి అని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రూ. 500 నోట్ల రద్దు గురించి వస్తున్న పుకార్లు ప్రజల్లో మరింత ఆందోళన కలిగించాయి.
అయితే ఏప్రిల్ 2025లో ఆర్బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్ ఈ ఊహాగానాలకు దారి తీసి ఉండొచ్చు. ఈ సర్క్యులర్‌లో బ్యాంకులు, వైట్ లేబుల్ ATM ఆపరేటర్లు (WLAOలు) తమ ఏటీఎంల ద్వారా రూ. 100, రూ. 200 డినామినేషన్ నోట్లను ఎక్కువగా చలామణి చేయాలని ఆదేశించింది.
"తరచుగా ఉపయోగించే నోట్లను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా, అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ATM ఆపరేటర్లు (WLAOలు) తమ ATMలు రూ. 100, రూ. 200 డినామినేషన్ నోట్లను క్రమం తప్పకుండా అందిస్తున్నాయని నిర్ధారించుకోవాలి" అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్‌లో తెలిపింది. ఈ చర్య, రూ. 500 నోట్లను ఉపసంహరించుకోవడానికి సంబంధించినది కాదు. ఇది రోజువారీ లావాదేవీలకు ఎక్కువగా ఉపయోగించే చిన్న డినామినేషన్ నోట్లను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్దేశించినది మాత్రమే.
Latest News