ప్లాట్‌ vs ఫ్లాట్‌.. మీరు కొనేందుకు ఏది బెస్ట్.
 

by Suryaa Desk | Fri, Jun 06, 2025, 09:21 PM

 రియల్ ఎస్టేట్... చాలా మందికి ఇది అత్యంత సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి ఎంపిక. మీ జీవితంలో తీసుకునే అతి పెద్ద ఆర్థిక నిర్ణయాలలో ఆస్తి కొనుగోలు ఒకటి. అయితే, సొంత స్థిరాస్తిని సమకూర్చుకోవాలని ఆలోచించేటప్పుడు, చాలా మందికి ఎదురయ్యే పెద్ద ప్రశ్న - ప్లాట్ కొనాలా? లేక ఫ్లాట్ కొనాలా? మొదటిసారి కొనుగోలు చేసే వారికి ఈ నిర్ణయం గందరగోళంగా మారడం సహజం. మీ కష్టార్జితాన్ని ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం. సులభమైన ఫైనాన్సింగ్, అధిక రాబడి, పన్ను ప్రయోజనాలు వంటి ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్లాట్, ఫ్లాట్ రెండింటి లాభనష్టాలను ఇప్పుడు విశ్లేషిద్దాం.


ఆస్తి విలువ: దేనికి వేగంగా ధర పెరుగుతుంది?


ప్లాట్, ఫ్లాట్ రెండూ కాలక్రమేణా విలువ పెరిగే ఆస్తులే. అయితే, వాటి విలువ పెరుగుదలకు కారణాలు వేర్వేరుగా ఉంటాయి. రోడ్లు, మెరుగైన రవాణా సౌకర్యాలు, మెట్రో లైన్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఒక ప్రాంతానికి కొత్త జీవం పోస్తుంది. ఇది ఎక్కువ మంది నివాసితులను ఆకర్షించి, ఆ ప్రాంతంలోని ఆస్తులకు డిమాండ్‌ను పెంచుతుంది.


పెట్టుబడి నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫ్లాట్‌ల కంటే ప్లాట్‌లు ధర చాలా వేగంగా పెరుగుతుంది. ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి దగ్గరగా ఉండటం, మార్కెట్ స్థిరత్వం అన్నీ విలువ పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. పరిస్థితులు చాలా కాలం పాటు స్థిరంగా ఉన్నప్పుడు భూమి మరింత విలువైనదిగా మారుతుంది. కాబట్టి, మీరు దీర్ఘకాలంలో మీ పెట్టుబడి విలువ బాగా పెరగాలని కోరుకుంటే, ప్లాట్ కొనుగోలు తెలివైన పని. అంతేకాదు, మీరు సృజనాత్మకంగా ఆలోచించి, మీ అభిరుచికి తగ్గట్టుగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ప్లాట్ ఉత్తమ ఎంపిక.


ఫ్లాట్ కొనుగోలు.. అద్దె ఆదాయం..


ఒకవేళ మీకు త్వరగా నివాసిత స్థలం అవసరం అయితే, ఫ్లాట్ కొనుగోలు చేయడం మంచి ఆలోచన. పెట్టుబడితో పాటు వెంటనే నివసించేందుకు స్థలం కావాలనుకుంటే వారు ప్లాట్‌ల కంటే ఫ్లాట్‌లను ఇష్టపడతారు. మీరు ఒక అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినప్పుడు, దాన్ని వెంటనే అద్దెకు ఇవ్వొచ్చు. ఇంటీరియర్ ఫర్నిషింగ్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తే సరిపోతుంది. త్వరగా అద్దె ఆదాయాన్ని సంపాదించాలనుకుంటే ఫ్లాట్ గొప్ప ఎంపిక. అంతేకాకుండా, అపార్ట్‌మెంట్లలో కమ్యూనిటీ లివింగ్, సెక్యూరిటీ, అదనపు సౌకర్యాలు (జిమ్, స్విమ్మింగ్ పూల్, క్లబ్‌హౌస్ వంటివి) లభిస్తాయి.


లోన్, టాక్స్ బెనిఫిట్స్..


రుణం పొందాలని చూస్తున్నట్లయితే, అపార్ట్‌మెంట్‌కు సులభంగా రుణం లభిస్తుంది. దాని ధరలో 80-90 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. వడ్డీ రేట్లు సాధారణంగా ప్లాట్ రుణాల కంటే తక్కువగానే ఉంటాయి. అంతేకాకుండా, దాన్ని తిరిగి చెల్లించడానికి మీకు 20-30 సంవత్సరాల వరకు సమయం లభిస్తుంది.


పన్ను ప్రయోజనాల విషయానికి వస్తే, మీరు అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసినప్పుడు అసలు, వడ్డీ, స్టాంప్ డ్యూటీ వంటి ఇతర ఖర్చులతో సహా రుణాలపై పన్ను మినహాయింపులను పొందొచ్చు. మీరు హోం లోన్‌తో.. ఫ్లాట్ కొనుగోలు చేసి ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తే, రూ. 2 లక్షల వరకు వడ్డీపై పన్ను మినహాయింపునకు అర్హత పొందుతారు. అదనంగా, అసలు చెల్లింపుపై రూ.1.50 లక్షల వరకు సెక్షన్ 80C కింద మినహాయింపు లభిస్తుంది. ప్లాట్‌కు మాత్రం నిర్మాణం పూర్తయిన తర్వాత మాత్రమే పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.


ప్లాట్ కొనుగోలు.. కష్టమే!


ప్లాట్ కొనడం సులభంగా అనిపించినా, అది చాలా పనితో కూడుకున్నదే. ముఖ్యంగా ఇల్లు కట్టడానికి ప్లాట్ కొన్నట్లయితే, చాలా లీగల్ వ్యవహారాలను పర్యవేక్షించాల్సి వస్తుంది. అంతేకాకుండా, ఆర్కిటెక్ట్‌లు, మేస్త్రీలు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు వంటి వారి కోసం వెతకాలి. పనిలో, నిర్మాణ ప్రక్రియకు సంబంధించిన ప్రతి దశలోనూ మీరు చురుగ్గా ఉండాలి. వివిధ ప్రక్రియల గురించి తెలుసుకోవాలి. కాబట్టి, ప్లాట్ కొనడం, ఆపై ఇల్లు కట్టడానికి చాలా సమయంతో పాటు శ్రమను, శక్తిని వెచ్చించాల్సి ఉంటుంది.


నిపుణుల అభిప్రాయం: ప్లాట్లు, అపార్ట్‌మెంట్‌లు మీ రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోలో భాగంగా ఉన్నప్పటికీ, వీటిపై అప్రిసియేషన్ (వాల్యూ అప్రిసియేషన్) మారుతూ ఉంటుంది. సాధారణంగా, అపార్ట్‌మెంట్‌లతో పోలిస్తే ప్లాట్ల సరఫరా పరిమితంగా ఉన్నందున, ప్లాట్‌లపై అప్రిసియేషన్ రేటు లేదా పెట్టుబడిపై రాబడి సాధారణంగా దీర్ఘకాలానికి అపార్ట్‌మెంట్‌ల కంటే ఎక్కువగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం.


చివరగా.. మీరు ఒక ప్లాట్‌లో పెట్టుబడి పెట్టాలా లేదా అపార్ట్‌మెంట్ కొనాలా అనే నిర్ణయం మీ ఆర్థిక లక్ష్యాలు, అవసరాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, మీరు వెచ్చించగల సమయంపై ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడి, సొంత ఇంటి నిర్మాణం, అధిక అప్రిసియేషన్ కోరుకుంటే ప్లాట్ ఉత్తమ ఎంపిక. తక్షణ నివాసం, అద్దె ఆదాయం, తక్కువ నిర్వహణ, సులభమైన రుణాలు, తక్షణ పన్ను ప్రయోజనాలు కోరుకుంటే ఫ్లాట్ అనుకూలంగా ఉంటుంది.

Latest News
Melbourne Renegades sign Andrew Tye ahead of BBL 15 Sat, Dec 13, 2025, 12:57 PM
Warner urges Konstas to stay grounded amid rising spotlight ahead of BBL 15 Sat, Dec 13, 2025, 12:51 PM
US senators seek to overturn Trump rule hitting Indian H-1B spouses Sat, Dec 13, 2025, 12:49 PM
Trump tariffs narrow US trade deficit to five-year low: White House Sat, Dec 13, 2025, 12:38 PM
Kerala local polls: Congress, BJP makes gains as CM Vijayan's CPI-M takes a beating Sat, Dec 13, 2025, 12:34 PM